హరీష్ శంకర్ కి మంచి మ్యూజిక్ టేస్ట్ వుంది. ఆయన సినిమాల్లోని దాదాపు పాటలు జనాల్లోకి వెళ్ళిపోతాయి. ప్రస్తుతం రవితేజతో చేస్తున్న మిస్టర్ బచ్చన్ ఆల్బమ్ కూడా క్యాచిగా తయారుచేసినట్లు కనిపిస్తోంది. ఫస్ట్ సింగిల్ సితార్ పాటకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పాట వినగానే చిరంజీవి 90s ప్లే లిస్టు గుర్తువచ్చేలా భలే కలర్ ఫుల్ గా వినసొంపుగా అనిపించింది.
ఇప్పుడు రెప్పల్ డప్పులు అంటూ సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. మొదటి పాట క్లాస్ అయితే ఇది మాస్. మిక్కీ జే మేయర్ తనదైన పంధాలో ఈ పాటని మాస్ కి నచ్చేలా ట్యూన్ చేశాడు. బీట్స్ కాళ్ళుకదిపేలా వున్నాయి. బేస్ పంచ్ బావుంది. నిజానికి మిక్కీ కంపోజిషన్ ఇంత లౌడ్ గా వుండదు. కానీ రవితేజని ద్రుష్టిలో పెట్టుకొని ఆయన కూడా మీటర్ పెంచినట్లే అనిపించింది. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ మాస్ వైబ్ తో పాడారు.
కాసర్ల శ్యామ్ బీట్ కి తగ్గ లిరిక్స్ రాశారు.
బొమ్మా సోకులో
బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులో
బప్పిలహరే… లైన్ భలే గమ్మత్తుగా కుదిరింది.
రవితేజ ఎప్పటిలానే భలే ఎనర్జిటిక్ గా కనిపించారు. భాగ్యశ్రీ గ్లామర్ మరో ఆకర్షణ. సాంగ్ లో మంచి మాస్ మూడ్ వుంది. ఈ పాట కూడా పాసైపోయినట్లే.