అఖిల్ సినిమా ‘ఏజెంట్’ 2023లో వచ్చింది. అది డిజాస్టర్. ఆ తరవాత అఖిల్ సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. యూవీ క్రియేషన్స్ లో అఖిల్ ఓ సినిమా చేయాలి. అనిల్ దర్శకుడు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.100 కోట్లు. ఈ కాంబోపై అధికారిక ప్రకటన వచ్చింది. కానీ అప్పటి నుంచీ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. అఖిల్ ప్రస్తుతం ఈ పాత్ర కోసం సంసిద్ధం అవుతున్నాడని, మరోవైపు స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని చిత్రబృందం చెబుతోంది.
Also Read : Also Read : ‘విశ్వంభర’లో హనుమాన్
అయితే లెక్క మాత్రం వేరేలా ఉంది. యూవీ ప్రస్తుతం ఆర్దిక ఇబ్బందుల్లో ఉంది. ఉన్న పెట్టుబడి మొత్తం చిరంజీవి ‘విశ్వంభర’పై పెట్టేసింది. దాదాపు రూ.150 కోట్ల సినిమా అది. సంక్రాంతికి వస్తుంది. ఆ సినిమాకు సంబంధించిన లావాదేవీలు అన్నీ పక్కాగా జరిగితే… చేతిలో కొంత డబ్బు ఉంటుంది. దాంతో అఖిల్ సినిమా మొదలు పెట్టాలన్న ఆలోచనలో ఉంది. అంటే… ‘విశ్వంభర’ బిజినెస్ క్లోజ్ అయ్యేంత వరకూ అఖిల్ సినిమా అలా పెండింగ్ లో ఉంటుందన్నమాట. చిరంజీవి సినిమా. పైగా సోషియో ఫాంటసీ అంటే ఆ క్రేజ్ వేరు. అన్నింటికంటే ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఉన్న సినిమా. కాబట్టి బయ్యర్లు మొగ్గు చూపించే అవకాశాలు ఉన్నాయి. నాన్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయి, అడ్వాన్సులు ముడితే, అప్పుడు అఖిల్ సినిమాను మొదలెట్టొచ్చని యూవీ భావిస్తోంది. లేదా `విశ్వంభర` విడుదలై, లెక్కలన్నీ తేలాక.. అఖిల్ సినిమా పట్టాలెక్కించొచ్చు అనుకొంటోంది. అలాగైతే 2024 మొత్తం అఖిల్ ఖాళీగా ఉండిపోయినట్టే. ‘విశ్వంభర’ మంచి విజయాన్ని అందుకొని, భారీ లాభాలొస్తే, అఖిల్ సినిమా బడ్జెట్ గురించి యూవీకి బెంగ ఉండకపోవొచ్చు. అటూ ఇటూ అయితే మాత్రం అప్పుడు లెక్కల్లో తేడా రావొచ్చు. ఏదేమైనా అఖిల్ తదుపరి సినిమా భవితవ్యం ఇప్పుడు చిరు చేతుల్లో ఉంది.