తాము కరిగిపోతూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు మిడిల్ క్లాస్. తమకు ఒక్క పథకం అందకపోయినా అన్ని పథకాలకూ నిధులు అందిస్తున్నారు. తమ కు . .తమ పిల్లలకూ విద్యా, వైద్యాన్ని భారీగా ఖర్చు పెట్టుకుని పొందుతున్నా ఇతర పార్టీల ఓటు బ్యాంకులకు కావాల్సిన ధనాన్ని సమకూరుస్తున్నాడు. నోరు తెరవకుండా తనపై పడుతున్న భారాన్ని మోసుకుంటూ పోతున్న మిడిల్ క్లాస్ మనుషులపై ఏ ప్రభుత్వమూ సానుభూతి చూపడం లేదు. వీలైనంతగా దోచుకునే ప్రయత్నం చేస్తోంది. మరోసారి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన పద్దు అదే చేసింది. పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు.. ఇతర ఖర్చులపై మరింత భారం మోపేలా చేయడమేల కాకుండా.. ఆదాయపు పన్నులో అయినా మినహాయింపు ఇద్దామన్న ఆలోచన కూడా చేయలేదు. అందుకే బడ్జెట్ ప్రసంగం అయిపోయిన తర్వాత మద్యతరగతి ప్రజల రక్తం తాగుతున్నట్లుగా మీమ్స్ సృష్టించారు సోషల్ మీడియా క్రియేటర్లు. ఆ జాబితాలో ఉన్నవారందరికీ ఆ మీమ్స్ నచ్చేశాయి.. ఎందుకంటే నిజంగానే మధ్యతరగతి ప్రజలంతా… తాము స్వేదం చిందించుకుని పని చేసుకుంటే…తమ ఆదాయంలో సగం ప్రభుత్వం అప్పనంగా తీసుకుని అర్హత లేని వాళ్లకు కట్టబెడుతోందన్న ఆగ్రహం ఉంది.
Read Also :ఆంధ్రప్రదేశ్‌కి ది బెస్ట్ బడ్జెట్
దేశానికి 19 శాతం ఆదాయం ఇస్తున్న 2.2 శాతం ఆదాయపు పన్ను చెల్లింపు దారులు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంచనాలు మొత్తంగా రూ. 48 లక్షల కోట్లకు కాస్త ఎక్కువ. ఇందులో ఆదాయపు పన్ను ద్వారా వచ్చే మొత్తం 19 శాతం. అంటే రూ. పది లక్షల కోట్ల వరకూ ఆదాయపు పన్ను రూపంలో చెల్లిస్తారు. 19 శాతం పన్ను చెల్లించేవారు ఎంత మంది అంటే.. దేశ జనాభాలో 2.2 శాతమేనని కేంద్రం చెబుతోంది. అంటే… మన దేశంలో 2.,2 శాతం మంది వ్యక్తిగతంగా 19 శాతం పన్ను చెల్లిస్తున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత ఆదాయపు పన్ను. అంటే వ్యక్తులు సంపాదించే మొత్తంపై వేసే పన్ను. ఇందులో శ్లాబుల్ని బట్టి 30 శాతం వరకూ వసూలు చేస్తారు, అంటే ఓ వ్యక్తి తన జీతం ద్వారానో.. మరో విధంగానో 50 లక్షలు రూపాయలు సంపాదిస్తే అందులో ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిందే. ఈ యాభై లక్షలు సంపాదించేవాళ్లు కాస్త తక్కువే ఉండవచ్చు కానీ.. వారు ఎక్కడా లాభాలు పొందకుండా కేవలం కష్టార్జితం ద్వారా సంపాదించిన సొమ్ముపై అంత భారీగా పన్ను వేయడం అవసరమా ?. ఇది. యాభై లక్షల స్లాబ్ పరిధిని పక్కన పెడితే…. మూడు లక్షల కన్నా రూపాయి ఎక్కువ సంపాదించినా పన్ను కట్టాల్సిందే. ఈ రోజుల్లో నగరాల్లో ఓ కాంట్రాక్టర్ దగ్గర సిమెంట్ పనికి కూలికి వెళ్తే రోజుకు వెయ్యి ఇస్తారు.. రోడ్డు మీద అడ్డా కూలీలు కూడా రోజుకు వెయ్యి ఇవ్వకపోతే పనుల్లోకి రారు. అంటే వారికి ఆదాయం నెలకు ముప్ఫై వేలు ఉంటుంది. ఏడాది 3 అరవై వేలు. అంటే అరవై వేలకు పన్ను కట్టాల్సిందే. ఇక్కడ కూలీల వ్యవహారంలో అంత వ్యవస్థీకృతం కాదు కాబట్టి… వారు టాక్సులు, రిటర్నుల జోలికి వెళ్లడం లేదు. కానీ ప్రభుత్వం ఏదో రోజు.. ఇలా రోజు వారీగా కూలీ పనులు చేసుకుంటున్న వారి ఆదాయాన్నీ లెక్క కట్టే విధానాన్ని ప్రకటించకుండా పోదు. ఆ స్థాయిలోనే పీల్చుడు కార్యక్రమం జరుగుతోంది.
మధ్యతరగతిపై డబుల్, త్రిబుల్ ట్యాక్సుల భారం
ఈ విషయం పక్కన పెడితే దేశంలో చాలా మంది పన్నులు ఎగ్గొడుతున్నారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. కేవలం 2.2 శాతమే పన్నులు కడుతున్నారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. మిగతా అందరూ హాయిగా ఉన్నారని.. పన్నులు కట్టడంలేదని చెబుతున్నారు. నిజం చెప్పాలంటే దేశంలో అడుక్కుతినేవాడి దగ్గరా పన్నులు వసూలు చేస్తున్నారు. జీఎస్టీపేరుతో ప్రతీ వస్తువుపైనా పన్ను వేస్తున్నారు. బడ్డీ కొట్టు దగ్గర టీతాగినే జీఎస్టీ పడలేదు కదా అని అనుకోవచ్చు. కానీ ఆ బడ్డీ కొట్టువాడు కొన్న పాల ప్యాకెట్ నుంచీ టీ పొడి వరకూ ప్రతీ దాని మీద పన్ను వేసి ఉంటారు. చెల్లించే టీ డబ్బుల్లో ఆ పన్నులు కూడా ఉంటాయి. ఇక జీఎస్టీ వేసే హోటల్ కు వెళ్లి టీ తాగితే… త్రిబుల్ ట్యాక్స్ అవుతుంది. అంటే సంపాదించుకున్నదానికి పన్ను కట్టాలి. విడిగా హోటల్ వాడు కొన్న ముడిపదార్థాలకూ తన వాటాగా జీఎస్టీ కట్టాలి.. మళ్లీ అన్నీ తయారు చేసిన తర్వాత తాగినందుకు బిల్లులో మరో సారి జీఎస్టీ కట్టాలి. అంటే… ఓ వ్యక్తికి తెలియకుండానే ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలోనూ.. పన్నుల మీద పన్నులు ఉంటాయి. ఇలా ఓ వ్యక్తి ఖర్చు పెట్టే ఆాదాయంలో ప్రభుత్వానికి 30శాతం వరకూ వెళ్తుంది. ఓ కూలీ తన ఆదాయంలో ఓ పదివేలు నెలకు ఖర్చు పెట్టాడంటే.. అందులో మూడు వేలు పన్ను ఉంటుంది. ఆయన ఆదాయం పన్ను కట్టలేకపోవచ్చు.. కానీ పన్ను మాత్రం దండిగా కడుతున్నారు. ఇలా జీఎస్టీ ద్వారా వస్తున్న ఆదాయం 18 శాతం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లెక్కల్లో చెబుతోంది. ప్రతీ నెలా జీఎస్టీ ద్వారా రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తోందని కేంద్రం చెబుతోంది. ఎలా చూసినా ఇరవై లక్షల కోట్లు వరకూ కేంద్రానికి దేశ ప్రజలు వస్తువులు కొనడం ద్వారా పన్నులు కడుతున్నారు. పెట్రోల్, డీజిల్, మద్యంపై పన్నులు అదనం. అంటే… మిడిల్ క్లాస్ ను పన్నుల్లో ఫ్రై చేసేస్తున్నారన్నమాట.
Read Also :తెలంగాణ బడ్జెట్..కేటాయింపులు ఇవే!
పన్నులు కట్టేల వారు ఏ ప్రభుత్వ పథకానికి.. సంక్షేమానికీ అర్హులు కారు !
ఈ మధ్యతరగతికి మరో ఆలోచన ఉండదు. మరింత కష్టపడి.. ఓ రూపాయి సంపాదించి కష్టాల నుంచి బయటపడాలని అనుకుంటూ ఉంటారు కానీ.. వారు సంపాదించేంది ప్రభుత్వాలకు పన్నులు కట్టడానికే. ఓ చిన్న ఇంటిని సమకూర్చుకోవడానికి నానా తంటాలు పడాలి. తన పిల్లల్ని చదివించుకోవాలంటే… లక్షలు అప్పులు చేయాలి. ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తే అప్పుల పాలవ్వాలి… ఎన్ని అప్పులున్నాయో కేంద్రానికి అనవసరం… సంపాదించుకుంటున్నారు కాబట్టి పన్నులు కట్టాలి… ఖర్చు పెడుతున్నారు కాబట్టి.. పన్నులు కట్టాలి. ఇక్కడ అసలు విషాదం ఏమిటంటే… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే సంక్షేమ పథకాల్లో వీరికి ఎవరికీ అర్హత ఉండదు. అంటే చిన్న రేషన్ కార్డుకూ దిక్కు ఉండదు. అసలు ప్రభుత్వ పరంగా సంక్షేమం అనేది ఆదాయపపు పన్ను టాక్స్ పేయర్స్కి.. మిడిల్ క్లాస్‌కి ఉండదు. కానీ వారి పథకాలకు మొత్తం డబ్బులు సమకూర్చేది వీరే. అంటే.. నిరుపేదల పేరుతో రేషన్ కార్డు పొందిన వారు… ప్రభుత్వాల నుంచి దండిగా సంక్షేమం అందుకుంటారు. బడాబాబులు.. పన్నుల్ని ఎలా ఎగ్గొట్టాలో తమదైన పద్దతుల్లో తాము ప్రయత్నాలు చేసుకుంటారు… ఒక వేళ నిజాయితీగా కట్టినా… వారి సంఖ్య చాలా స్వల్పం. అత్యధికులు మిడిల్ క్లాస్ పీపులే. వారినే ప్రభుత్వం పిండుకుంటోంది. మధ్యతరగతి నుంచి పన్నులు పిండుకోవడానికి కొత్త కొత్త మార్గాలను ఎప్పటికప్పుడు అన్వేషిస్తూనే ఉన్నారు. ఎప్పుడో దశాబ్దాలకిందట కొన్న ఆస్తిని అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకుంటే… దానిపై వచ్చే లాభంపైనా క్యాపిటల్ గెయిన్స్ పన్ను 12 శాతం చెల్లించాలి. అంటే ముఫ్పై ఏళ్ల కిందట 10 లక్షలు పెట్టి కొన్న ఇంటిని ఇప్పుడు కోటి రూపాయలకు అమ్మితే… 90 లక్షలపై పన్నెండు శాతం పన్ను కట్టాలి. మేలు చేస్తున్నట్లుగా ఇండెక్సేషన్ పేరుతో చేస్తున్న ఇలాంటి దోపిడీ వల్లే మధ్యతరగతిలో అసహనం పెరిగిపోతోంది.
మిడిల్ క్లాస్ ప్రజల్లో అసహనం పెరిగితే కష్టమే !
2.2 శాతం ఆదాయపు పన్ను కట్టే వారు డబుల్, త్రిబుల్ పన్నులు కడుతున్నారు. వారిపై దేశంలో ఎవరికీ సానుభూతి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నెలకు యాభై వేల వరకూ సంపాదించకపోతే నిరుపేద కింద లెక్కే. ఎందుకంటే ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఇంటి అద్దె పది వేల వరకూ ఉంటుంది. ఇక స్కూల్ ఫీజులు.. నిత్యావసర సరకులు… నిత్యం పెరిగిపోయే ఇతర ఖర్చులతో .. ఓ కుటుంబాన్ని నడపడానికి యాభై వేలు సరిపోవు. అందుకే మధ్యతరగతి రుణఊబిలో చిక్కుకుపోతోంది. ఎంత రుణం ఉందనే ది పట్టించుకోకుండా ఆదాయం వాటా కేంద్రం తీసేసుకుంటుంటుంది కాబట్టి వారు ఎప్పటికీ ఆ రుణఊబి నుంచి బయటకు రాలేరు. రేపు ఏమైనా సమస్య వచ్చి అసలు ఆదాయం లేకుండా పోతే… ఆ టాక్స్ పేయర్ కుటుంబాన్ని ఎవరైనా పట్టించుకుంటారా అంటే సమస్యే లేదు.. ఆ కుటుంబం ఇక లెక్కలోకి రాదు. ఎవరూ ఆదుకోరు. దేశ మధ్యతరగతి ప్రజల్లో అసహనం పెరిగిపోతోందనడానికి ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే కారణం. దేశ ప్రజల్ని విడదీసి రాజకీయాలు చేయడాన్ని పార్టీలు చాలా కాలంగా చేస్తున్నాయి. కానీ అన్ని పార్టీలు మిడిల్ క్లాస్ ప్రజల్ని పిండుకోవడానికి ఉన్న ఏకైక వర్గంగా చూస్తున్నాయి. ఇలాంటిపరిస్థితి వల్ల దేశాన్ని ఆదాయ పరంగా నిలబెడుతున్న వర్గం … తాము దోపిడీకి గురవుతున్నామన్న అసహనానికి గురవుతున్నారు. ఇది దేశానికి మంచిది కాదు. దేశంలో పన్నులు కట్టేవారి కుటుంబాలకు అయినా విద్యా, వైద్య సౌకర్యాలు మెరుగ్గా వచ్చే ఏర్పాటు చేయాలి, వారు ఆర్థికంగా చితికిపోకుండా కాపాడాలి. ఇప్పటి వరకూ ఇలాంటి ఆలోచనలు ఏ ప్రభుత్వాలూ చేయడం లేదు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ కూడా చేయడం లేదు.
కడుతున్నారు కదా అని .. పన్నుల మీద పననులు బాదేస్తే… మధ్యతరగతి ప్రజలు భరించినంత కాలం కడతారు.. తర్వాత ఒక్క సారిగా తిరగబడతారు. అది పాలనలో ఉన్న పార్టీలకే కాదు.. మొత్తం దేశం ఆర్థిక వ్యవస్థకూ మంచిది కాదు. పథకాల విషయంలో బ్యాలెన్స్ చూపించాలి. పన్నులు కట్టే వారి సంక్షేమాన్ని కూడా చూడాలి. వారిని దోపిడీ చేయడం ఆపాలి. ఈ మార్పు రావాలి.