శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో కోకాపేట్ అనగానే భారీ భవనాలు, ఐటీ కంపెనీల్లో పనిచేసే వారి నివాస సముదాయాలు గుర్తుకు వస్తాయి. అయితే, వేలాది గేటెడ్ కమ్యూనిటీలతో పాటు లగ్జరీ నివాస సముదాయాలు కోకాపేట్ లో అతి తక్కువ సమయంలోనే పుట్టుకొచ్చాయి. దీంతో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంది.
భవిష్యత్ లో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని… హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతినకుండా ప్రభుత్వం మెట్రోను కోకాపేట్ వరకు విస్తరించాలని నిర్ణయించింది. గతంలో రాయదుర్గ్ నుండి శంషాబాద్ వరకు మెట్రో విస్తరణకు కేసీఆర్ హయంలో ప్రణాళికలు వేయగా, రేవంత్ సర్కార్ వచ్చి రాగానే రూట్ ప్లాన్ మార్చి ఓల్డ్ సిటీ నుండి శంషాబాద్ కు మెట్రో మార్గాన్ని తలపెట్టింది. రాయదుర్గం నుండి ఉన్న ఎలైన్మెంట్ మార్చి యూఎస్ కాన్సులేట్ వరకు విస్తరించాలని తొలుత నిర్ణయించారు.
Also Read : చీల్చి చెండాడుతా… బడ్జెట్ పై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్
కానీ, తాజాగా ఈ ప్రతిపాదనను కూడా మార్చి కోకాపేట్ వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త ప్రతిపాదన వల్ల 3.3కి.మీ మేర పొడువు పెరిగింది. దీంతో విస్తరణ వ్యయం కూడా మారింది. ఇందుకు తగ్గట్లుగానే కొత్త బడ్జెట్ లో నిధుల కేటాయింపు చేశారు. ఈ మార్గంలోనే కాదు శంషాబాద్ వరకు పొడిగింపు మార్గంలోనూ ఎలైన్మెంట్ మరోసారి మార్చారు. ఈ రూట్ లోను మెట్రో మార్గం మరో 4కి.మీ మేర పెరిగింది.
కొత్త ప్రతిపాదనలతో డీపీఆర్ రెడీ చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వమే సొంత ఖర్చుతో నిర్మించే ఆలోచన ఉందని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. మియాపూర్ నుండి పటాన్ చెరు రూట్ ను యాధాతథంగా నిర్మించబోతున్నారు.