రామ్ – పూరి కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకొంది. అందుకే ‘డబుల్ ఇస్మార్ట్‌పై’ అంచనాలు పెరిగాయి. ఆ ప్రభావం బిజినెస్‌పై కూడా కనిపిస్తోంది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ.60 కోట్లకు అమ్ముడయ్యాయి. సౌత్ ఇండియన్ లోని అన్ని భాషల ఓటీటీ రైట్స్ అమేజాన్ రూ.33 కోట్లకు చేజిక్కించుకొంది. ఆదిత్య సంస్థ ఆడియో రైట్స్ ని రూ.9 కోట్లకు కొనేసింది. అంటే… ఇక్కడే వంద కోట్లు వచ్చేశాయి. ఇక హిందీ డబ్బింగ్, శాటిలైట్ రైట్స్, తెలుగు శాటిలైట్ హక్కులూ అమ్ముడవ్వాలి. సంజయ్‌దత్ ఉన్నాడు కాబట్టి, హిందీ డబ్బింగ్ మంచి రేటే పలికే అవకాశం ఉంది. ఆ రూపేణా ఎటు చూసినా మరో రూ.20 కోట్ల వరకూ వచ్చేస్తుంది. ఈ సినిమాకి అటూ ఇటుగా రూ.90 కోట్లు ఖర్చయ్యిందని టాక్. అంటే.. ఇప్పటికే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది.
Also Read : డబుల్ ఇస్మార్ట్: ఈసారి ‘చిప్’ ఎవరిది?
పూరి సినిమాలకు ప్రీ బిజినెస్ విషయంలో బెంగ లేదు. ‘లైగర్’ ఫ్లాప్ అయినా, నాన్ థియేట్రికల్ బిజినెస్ బ్రహ్మాండంగా జరిగింది. విడుదలకు ముందే ఆ సినిమా సేఫ్. ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా అంతే. ‘లైగర్’ అనుకొన్న ఫలితం రాకపోయినా, పూరి వెనుకంజ వేయలేదు. రామ్ సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలో, అంతకంటే ఎక్కువే పెట్టి ‘డబుల్ ఇస్మార్ట్’ తన సొంత బ్యానర్లో తీశాడు. ఆ నమ్మకం నిజమై, ఈరోజు విడుదలకు ముందే బిజినెస్ పూర్తయ్యింది. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల అవుతోంది. వరుసగా సెలవలు కలసిరావడంతో లాంగ్ వీకెండ్ దక్కింది. సో… సినిమా బాగుంటే, థియేట్రికల్ నుంచి కూడా మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది.