తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ..ఏ నోటిఫికేషన్ ఏ రోజున విడుదల అవుతుందనే వివరాలు జాబ్ క్యాలెండర్ లో ఉంటాయన్న భట్టి..పోస్టుల సంఖ్య నోటిఫికేషన్ విడుదల సమయంలో ప్రకటిస్తామని వెల్లడించారు.
పాత గ్రూప్ 1 ను రద్దు చేసి 60నూతన ఖాళీలను జత చేసి..563ఖాళీల కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. ప్రిలిమినరీ పరీక్షకు 3,02, 172మంది అభ్యర్థులు హాజరవ్వగా..పరీక్షను సజావుగా నిర్వహించామని తెలిపారు. మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు నిర్వహించేలా షెడ్యూల్ చేసినట్లుగా వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ శాఖలలోని 32వేల మంది యువతకు నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. అదనంగా 13,500ఖాళీల భర్తీకి అనుమతులు కూడా ఇచ్చామన్నారు. 11,062 ఖాళీలతో టీచర్ రిక్రూట్ మెంట్ కోసం డీఎస్సీ నిర్వహించామన్నారు. జులై 18నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు ఆగస్టు 5న ముగియనున్నట్లు చెప్పారు.
ఇక, 1,45,362 మంది దరఖాస్తు దారులు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షకు..1, 06, 263మంది దరఖాస్తు దారులు డివిజినల్ అకౌంట్ ఆఫీసర్ పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. 435సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం MNJక్యాన్సర్ ఆసుపత్రిలో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు.
పరీక్షల మధ్య ప్రిపరేషన్ కోసం తగినంత సమయం లేదని.. పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థనకు సానుకూలంగా స్పందించినట్లు దాంతోనే ఇటీవల గ్రూప్ 2 పరీక్షను ఆగస్ట్ 7, 8 తేదీ నుంచి డిసెంబర్ కు వాయిదా వేసినట్లు గుర్తు చేశారు.