ఏ ముహూర్తాన ‘బాహుబలి’ కథని రాజమౌళి రెండు భాగాలుగా తీశాడో, అప్పటి నుంచీ ‘సినిమా’ కలరింగే మారిపోయింది. కథని విస్తరించి, రెండు భాగాలుగా తీసి, కమర్షియల్గా డబ్బులు రాబట్టుకోవడానికి ఇదో అద్భుతమైన మార్గంలా కనిపించింది. ఈ దారిలోనే ‘కేజీఎఫ్’ కూడా సక్సెస్ కొట్టింది. ‘పుష్ష’ హిట్టయ్యేసరికి ‘పుష్ష 2’పై ఆశలు పెరిగిపోయాయి. వాటి బడ్జెట్ తో పాటు, మార్కెట్ కూడా చాప కింద నీరులా విస్తరించింది.
అయితే ‘పార్ట్ 2’ అంటే మామూలు ప్రెజర్ కాదు. రెండు మూడు సినిమాలకు సరిపడినంత ఒత్తిడి దర్శకుడిపై ఉంటోంది. దానికి ‘పుష్ష 2‘నే నిదర్శనం. ‘పుష్ష`’ ఊహించని విజయాన్ని అందుకోవడంతో సుకుమార్ మరింత అలెర్ట్ అయిపోయారు. అసలే ఆయన మిస్టర్ పర్ఫెక్ట్. స్క్రిప్టుని పదే పదే మార్చడం, రీ షూట్లు.. వీటి వల్ల సినిమా ఆలస్యమైంది. బడ్జెట్ అంతకంతకూ పెరిగిపోతూ వెళ్లింది. ఆగస్టు 15న రావాల్సిన సినిమా వాయిదా పడింది. దాంతో వడ్డీల భారం నిర్మాతలు మోయాల్సివచ్చింది. ‘పార్ట్ 2’ గొడవ లేకపోతే ఈపాటికి సుకుమార్, బన్నీ చెరో సినిమా పూర్తి చేసేసి, మరో సినిమా పనిలో పడిపోయేవాళ్లే.
సలార్ 2’పై కూడా ఇదే ఒత్తిడి ఉంది. సలార్ వచ్చి ఇన్నాళ్లయినా పార్ట్ 2 ప్రస్తావన లేదంటే దానికి కారణం.. స్క్రిప్టు పై దర్శకుడికి పట్టు చిక్కకపోవడమే. పెరిగిన అంచనాల్ని అందుకోవడం సామాన్యమైన విషయం కాదు. ‘సలార్’ ప్రపంచం ఎలా ఉంటుందో ప్రేక్షకుడికి ఇప్పటికే అర్ధమైపోయింది. ప్రభాస్ క్యారెక్టర్ ఎలాంటిదో తెలిసిపోయింది. ఇప్పుడు ప్రేక్షకుడ్ని రెండున్నర గంటల పాటు థియేటర్లో కూర్చోబెట్టాలంటే ఇంతకు మించి ఏదో కావాలి. అదేమిటో తెలీకే ప్రశాంత్ నీల్ సతమతమైపోతున్నాడు. ‘ఖైదీ 2’, ‘విక్రమ్ 2’లు పెండింగ్ లో ఉన్నాయి. ‘ఖైదీ’ ఈ స్థాయిలో ఆడుతుందని ఎవరూ ఊహించలేదు. ఆడేసింది. మరి పార్ట్ 2 ఎలా ఉండాలి? ఢిల్లీ క్యారెక్టర్ కి ఎలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంటే గూజ్ బమ్స్ వస్తాయి? ఇవన్నీ దర్శకుడ్ని ఊపిరి ఆడనివ్వకుండా చేసే అంశాలే. కాబట్టే.. ‘ఖైదీ 2’ స్క్రిప్టు ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. ‘విక్రమ్ 2’ పరిస్థితి కూడా అంతే. `విక్రమ్` క్లైమాక్స్ లో ఊహించని విధంగా సూర్య పాత్రని ప్రవేశ పెట్టి థ్రిల్ చేశాడు దర్శకుడు. కానీ ఇప్పుడు ఆ పాత్రతోనే చిక్కుంది. రోలెక్స్ పాత్రని ఎంత బాగా రాస్తే ‘విక్రమ్ 2’ అంత బాగా వస్తుంది. కమల్, సూర్య… వీళ్ల డేట్లు సర్దుబాటు అవ్వాలి. అప్పుడే ‘విక్రమ్ 2’ ఉంటుంది.
ఇప్పుడు ‘కల్కి 2’కీ ఇదే పరిస్థితి.’కల్కి’ని ముందే రెండు భాగాలుగా తీయాలని నాగ్ అశ్విన్ ఫిక్సయ్యాడు. కాబట్టి పార్ట్ 2లో ఎలాంటి కథ చెప్పాలో తనకు తెలుసు. కానీ అది కూడా అంత సులభం కాదు. విజువల్ గా మెస్మరైజ్ చేస్తూ, కొత్త క్యారెక్టర్లని ప్రవేశ పెడితే తప్ప… ‘పార్ట్ 2’పై ఆసక్తి రాదు. అందుకే నాగ అశ్విన్ ఇదే పనిలో తలమునకలై ఉన్నాడు. నిజానికి ఆగస్టులోనే `కల్కి 2` పట్టాలెక్కాలి. కానీ… నాగ్ అశ్విన్ స్క్రిప్టు కోసం మరింత సమయం తీసుకోవాలనుకొంటున్నాడు. ఇందుకోసం రైటర్స్ టీమ్ తో తర్జన భర్జనలు పడుతున్నాడు,
ఈ అనుభవాలతో దర్శకులు తెలుసుకోవాల్సిందేమిటంటే.. ‘పార్ట్ 2’ అంటూ చివర్లో ఓ ఎండ్ కార్డ్ వవుయడం సులభమే. కానీ ఆ టెంపో కొనసాగిస్తూ కథ చెప్పడం చాలా కష్టం. ఈ విషయం దర్శకులు గుర్తు పెట్టుకోవడం మంచిది.