ఓ ఆశయం కోసం పోరాడేవారు ఈ రోజుల్లో చాలా అరుదు. ఓ మూమెంట్ వచ్చిన తర్వాత ఓ పదవికో.. లేదంటే కాంట్రాక్టులకో తమ ఆశయాన్ని తాకట్టుపెట్టేసే నేతలు ఎక్కువగా ఉంటారు. కానీ ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాత్రం తాను అనుకున్న ఆశయానికే కట్టుబడి ఉన్నారు. ఇప్పటికీ ఆయన సొంత ఇల్లు లేదు. వ్యక్తిగత జీవితాన్నీ త్యాగం చేశారు. కానీ ఆయన అనుకున్నది మాత్రం సాధించారు.
మందకృష్ణ మాదిగకు ఏ రాజకీయ పార్టీతోనూ లేదా నేతతోనూ శత్రుత్వం ఉండదు. ఆయన జగన్ సహా అందర్నీ పొగిడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే అందర్నీ విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే.. వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడినప్పుడు అందర్నీ పొగిడారు… వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందర్నీ విమర్శించారు.
Also Read : చంద్రబాబు వల్లే ఎస్సీ వర్గీకరణ – మందకృష్ణ
ఆయన నాయకత్వం పవర్ తెలుసు కాబట్టి చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, కేసీఆర్ ఇలా అందరూ పదవులు ఆఫర్ చేశారు. చంద్రబాబు ఎప్పుడో పాతికేళ్ల కిందటే పెద్దపల్లి ఎంపీ టిక్కెట్ ఇస్తానన్నారు. పోనీ రాజ్యసభకు పోతావా అని చాన్స్ ఇచ్చారు. వైఎస్ మంత్రిని చేస్తామన్నారు. జగన్ , కేసీఆర్ పెద్దల సభకు పంపుతామని రాయబారం పంపారు. కానీ అన్నింటినీ తిరస్కరించారు. కానీ ఇండిపెండెంట్ గా రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. గెలవలేదు కానీ.. ఆయన బాధపడలేదు. ఎందుకంటే ఆయన పోటీ తను ఎమ్మెల్యే అవ్వాలని కాదు.
మూడు దశాబ్దాల తరవాత మందకృష్ణ వర్గీకరణ పోరాటం ఫలించింది. ఒకే ఒక్క ఆశయానికి కట్టుబడి ఆయన చేసిన ప్రయాణం.. పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. ఆయన ప్రయాణాన్ని వ్యతిరేకించవచ్చు కానీ.. ఆయన చూపిన పోరాట స్ఫూర్తిని మాత్రం తక్కువ చేయలేరు.