సూపర్ స్టార్ కృష్ణ వ్యక్తిత్వం గురించీ, ఆయన ఔదార్యం గురించీ చాలామంది చాలా రకాలుగా చెప్పుకొంటుంటారు. తన సినిమా ఆడకపోతే ఆయన నిర్మొహమాటంగా ఒప్పుకొనేవారు. ‘సినిమా స్లోగా ఎక్కుతుందిలే’ అని దర్శక నిర్మాతలు మొహమాటం కొద్దీ నీళ్లు నమిలినా ‘ఇక నిలబడేదేముంది? మన సినిమా పోయిందిలే..’ అని అక్కడికక్కడ చేతులు దులుపుకొనేవారు. కానీ నిర్మాతల్ని మాత్రం వదిలేవారు కాదు. ‘ఇంకో కథ తెచ్చుకో.. చేద్దాం’ అని నష్టాల్లో కూడా వెన్నుదన్నుగా నిలిచేవారు. తన దగ్గరకు ఓ మంచి కథ వస్తే.. ‘ఇది నాకంటే ఫలానా హీరోకే సూటవుతుంది’ అని రికమెండ్ చేసేవారు. అలా… తను తిప్పి పంపిన కథలతో చాలా మంది హీరోలు హిట్లు కొట్టారు. కెరీర్లో మైలు రాళ్ల లాంటి సినిమాల్ని చేశారు. చిరంజీవి కెరీర్ మలుపు తిరగడానికి ఓరకంగా కృష్ణనే కారణం.
Read Also : ఫ్లాష్ బ్యాక్: జమునని ఎందుకు బ్యాన్ చేశారు?
కృష్ణ ఫుల్ స్వింగ్ లో ఉన్న రోజులు అవి. సంయుక్త మూవీస్ సంస్థ కృష్ణతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసింది. అడ్వాన్సు కూడా ఇచ్చింది. చాలా కథలు వెళ్తున్నాయి. కృష్ణ రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. చివరికి ఓ మంచి యాక్షన్ కథ కృష్ణకు చెప్పారు. ఆయనకు బాగా నచ్చింది. ఇక హీరో ఫిక్సయిపోయాడని నిర్మాతలు ఖుషీ గా ఉన్నారు. ఈలోగా కృష్ణ మళ్లీ ఆ నిర్మాతల్ని కబురు పంపారు. ‘కథ చాలా బాగుంది. కానీ యాక్షన్ కి ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా ఇది. ఈ కథ నాకంటే చిరంజీవికి బాగా సూటవుతుంది. తను కుర్రాడు. యాక్షన్ సీన్స్ ని చాలా నాచురల్ గా చేస్తున్నాడు. డాన్సులు కూడా అదరగొట్టేస్తున్నాడు. ఈ కథ తనకు చెప్పండి. తనైతే ఇంకా బాగా న్యాయం చేయగలడు’ అన్నారు. కృష్ణ కాదనే సరికి ఆ నిర్మాతలు కాస్త నిరుత్సాహ పడినా, చిరంజీవి పేరు సూచించడంతో కాస్త సంతోషమేసింది. ఆ కథ చిరంజీవికి వినిపించడం, చిరు ఓకే చెప్పడం జరిగిపోయాయి. అదే ‘ఖైదీ’. 1983లో విడుదలైన ఈ సినిమా.. అప్పట్లో సంచలనం. చిరంజీవి కెరీర్ని నిలబెట్టేసింది. ఇక ఆ తరవాత చిరు వెనక్కి తిరిగి చూసుకొనే అవకాశం లేకుండా పోయింది. అదే కథని కృష్ణ చేసుంటే ఫలితం ఎలా ఉండేదో కానీ, టాలీవుడ్ కి మాత్రం చిరు రూపంలో ఓ మెగాస్టార్ మాత్రం దక్కేవాడు కాదు.