తణుకు నియోజకవర్గానికి చెందిన చేబ్రోలు బసవయ్య అనే యువకుడు కష్టపడి చదువుకుంటున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIIT లక్నోలో సీటు సాధించాడు. కానీ ఫీజులకు ఇతర ఖర్చులకు నాలుగు లక్షలు కావాలి. పేద కుటుంబానికి చెందిన బసవయ్యకు ఒకే ఒక్క మార్గం కనిపించింది. తన పరిస్థితిని వివరిస్తూ.. ర్యాంక్ కార్డును జత చేసి.. ట్వీట్ పెట్టాడు. లోకేష్‌కు ట్యాగ్ చేశాడు. అతను ఊహించాడో లేదో కానీ అరగంట కాక ముందే రెస్పాన్స్ వచ్చింది.
బసవయ్య నీ కలల్ని నెరవేర్చుకో..నేనున్నానని లోకేష్ భ రోసా ఇస్తూ వెంటనే స్పందించారు. ఫీజుల భారం తనకు వదిలేయాలని భరోసా ఇచ్చారు. లోకేష్ స్పందన చూసి బసవయ్య ఉబ్బితబ్బిబ్బయి ఉంటారు. సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన సమస్యలను.. శరవేగంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు లోకేష్. ఈ విషయంలో ప్రత్యేకమైన టీమ్ ను పెట్టుకున్నారేమో కానీ.. తనపై నమ్మకంతో పోస్టులు పెట్టిన ఎవర్నీ నిరాశపర్చడం లేదు.
తెనాలిలో మూతపడిన ఓ బాలికల హాస్టల్ గురించి ఒకరు ట్వీట్ పెడితే వెంటనే అధికారుల్ని పంపించారు. రోడ్డు సమస్య.. పించన్ సమస్య.. ఇతర సమస్యలు ఏవైనా ఆయన దృష్టికి వస్తే స్పందిస్తున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా కమ్యూనిస్టులను మడకశిరలో హౌస్ అరెస్టు చేశారు. దానికి లోకేష్ తాను స్వయంగా క్షమాపణలు చెప్పారు. నారా లోకేష్… తాను ఉన్నానన్న భరోసా ఆపన్నులకు ఇస్తున్నారు.