బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేల మధ్య అసంతృప్తి ఉందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పదవుల కోసమే పాకులాడుతున్నారన్న ఆగ్రహం వ్యక్తం అవుతోందా? ఇక్కడా కేసీఆర్ కుటుంబమేనా అన్న ఆగ్రహం వ్యక్తం అవుతోందా?
అంటే అవుననే తెలుస్తోంది. అధికారంలో ఉన్నన్ని రోజులు కీలకమైన పదవులు, అధికారాలు కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉన్నాయన్న చర్చ జరిగింది. రాజకీయంగా విమర్శలు కూడా వ్యక్తం అయ్యాయి. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారక కూడా అదే కొనసాగుతోంది.
తెలంగాణ అసెంబ్లీలో పీఏసీ చైర్మన్ నియామకం చేయాల్సి ఉంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ఏర్పాటు చేసి, ప్రతిపక్ష పార్టీకి చైర్మన్ అవకాశం ఇవ్వటం ఆనవాయితీ. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారు. అయితే, సీనియర్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చే పీఏసీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ లో ఎవరికి ఇస్తారు అన్న చర్చ జరిగినా, చివరకు మాజీ మంత్రి హరీష్ రావుకు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరిగింది.
కానీ, దీనిపై ఆ పార్టీలోని కొందరు సీనియర్లు కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కూడా వారేనా…? ఇంకెవరికి అయిన అవకాశం ఇస్తే తప్పేంటి అని పార్టీలో కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారని చర్చ సాగుతోంది. సీనియర్ ఎమ్మెల్యేలుగా సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, తలసాని, గంగుల వంటి చాలా మందే ఉన్నారు. మహిళలకు అవకాశం కల్పిస్తే పార్టీకి ఇంకా మైలేజ్ పెరుగుతుంది. కానీ, ఇక్కడ ఆ ఆలోచన ఎవరూ చేయటం లేదు… కీలకమైన పదవి కావటంతో ఇతరులకు ఇచ్చేందుకు మొగ్గుచూపటం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రారు… పార్టీ వాయిస్ గా హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరే కనపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి పోస్టులు కూడా ఇవ్వకపోతే పార్టీకే ప్రమాదం అని, ఇప్పటికైన గుర్తించాలన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.