బీహార్ శాసనసభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడి, అమిత్ షా ఇద్దరూ కలిసి లాలూ ప్రసాద్ యాదవ్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏవిధంగా తిట్టి పోశారో అందరికీ గుర్తుండే ఉంటుంది. వారికి అధికారం కట్టబెడితే బిహార్ లో మళ్ళీ ఆటవిక పరిపాలన మొదలవుతుందని పదేపదే ప్రజలను హెచ్చరించారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడి అదే నోటితో నితీష్ కుమార్ నేతృత్వంలో బిహార్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని తెగ పొగిడేశారు.
బీహార్ లో దిగా-సోనెపూర్ మధ్య దేశంలో కెల్లా అతిపొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిని ప్రారంభించడానికి ఈరోజు ఆ రాష్ట్రానికి వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోడి, “బిహార్ అభివృద్ధి చెందితేనే దేశం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. నితీష్ కుమార్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇది. సుమారు రూ.600 కోట్లు అంచనాతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుని గత పదేళ్ళుగా దేశాన్ని పాలించిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన దీని కోసం రూ.3,000 కోట్లు ఖర్చు పెట్టవలసి వచ్చింది. ఒక నిర్ణయం తీసుకోవడంలో జరిగిన ఆలస్యానికి లేదా నిర్లక్ష్యానికి అంత ప్రజాధనం వృధా అయింది. ఇప్పుడు రాష్ట్రంలో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. బిహార్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి పనిచేసినట్లయితే అభివృద్ధి ఇంకా వేగవంతం అవుతుంది. దేశాభివృద్ధికి బిహార్ చాలా కీలకమని నేను నమ్ముతున్నాను అందుకే ఇదివరకు ఐదేళ్ళలో బిహార్ రాష్ర్టంలో చేపట్టిన ప్రాజెక్టుల కంటే గత రెండేళ్ళలో రెట్టింపు ప్రాజెక్టులు జరుగుతున్నాయి,” అని అన్నారు.
ఎన్నికలయిపోయాయి కనుక ఇంకా ఇప్పుడు ఒకరినొకరు తిట్టుకొంటూ ద్వేషించుకొనవసరం లేదు. అయితే ప్రధాని మోడి బిహార్ ముఖ్యమంత్రిని అంతగా పొగడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయనేమి ఎన్డీయే కూటమిలో భాగస్వామి కాదు. భాజపాకి శత్రువయిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తి. అటువంటప్పుడు ఒకపక్క కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూనే నితీష్ కుమార్ ని అంతగా ఎందుకు పొగుడుతున్నారు అనే సందేహం కలగడం సహజం.
నితీష్ కుమార్ సుమారు 17 ఏళ్ల పాటు ఎన్డీయేలో కొనసాగారు. ఆయన బయటకి వెళ్ళిపోయి కాంగ్రెస్, లాలూ ప్రసాద్ యాదవ్ లతో చేతులు కలపడం చేతనే బిహార్ లో భాజపాకి తలుపులు మూసుకుపోయాయి. అవి మళ్ళీ ఎప్పటికయినా తెరుచుకోవాలంటే నితీష్ కుమార్ మళ్ళీ ఎన్డీయే కూటమిలోకి రప్పించవలసి ఉంటుంది. ఆయన అందుకు అంగీకరిస్తే ఆయన సహకారంతో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగబోతున్న పొరుగు రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీకి, దానితో జత కట్టాలని ఆత్రుత పడుతున్న కాంగ్రెస్ పార్టీకి కూడా చెక్ పెట్టవచ్చును.
“మిష్టర్ క్లీన్- మిస్టర్ పెర్ఫెక్ట్” అని పేరున్న నితీష్ కుమార్ మళ్ళీ ఎన్డీయేలోకి వస్తే డిల్లీలో పక్కలో బల్లెంలాగ తయారయిన అరవింద్ కేజ్రీవాల్ నోటికి కూడా తాళం వేయించవచ్చును. అలాగే ఏప్రిల్ నుండి ఎన్నికలు జరుగబోయే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీని ఆయన ద్వారా ప్రసన్నం చేసుకోవచ్చును. నితీష్ కుమార్ మళ్ళీ ఎన్డీయేలో చేరితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే మోడీ ఆయనని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించినట్లున్నారు. ఒకవేళ ప్రసన్నం అవదలచుకొన్నట్లయితే లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీలతో చాలా పెద్ద ఇబ్బంది ఎదుర్కోవడానికి సిద్దపదవలసి ఉంటుంది. కనుక నితీష్ కుమార్ తొందరపడక పోవచ్చును.