కలెక్టర్లను ప్రజలు నమ్మడం మానేశారు అని రెవిన్యూ శాఖ ఉన్నతాధికారి సిసోడియా కలెక్టర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యల్లో వంద శాతం నిజం ఉందని చంద్రబాబు సమక్షంలో ఉన్న కలెక్టర్లకే కాదు.. ఆ సమావేశాన్ని చూసిన వారందరికీ తెలుసు. ఇదే ఫీలింగ్ ఎస్పీలపైనా ఉంది. ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో దొంగలు, దొంగలు ఊళ్లు పంచుకుంటూంటే.. వారికి సహకరించడమే ఎస్పీలు, కలెక్టర్ల విధిగా మారిపోయింది. దాని ఫలితమే ఇవాళ ఎన్నో రకమైన సమస్యలు వస్తున్నాయి. ఒక్కో ఊళ్లో తమ భూమి లాక్కున్నారంటూ… వచ్చే ఫిర్యాదులు వందల్లో ఉంటున్నాయంటే.. ఐదేళ్లలో ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
క్రిమినల్ మైండ్ పాలకులకు అనుచరులుగా ఐదేళ్ల పాటు అరాచకం
ఎందుకిలా జరిగింది ? అంటే ఒక్కటే కారణం.. అది కూడా ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల నిర్వాకమే. మంచి పోస్టింగ్ ఇస్తే చాలు ఏం చేయమన్నా చేస్తామన్నట్లుగా వారు చెలరేగిపోయారు. ఇలాంటి వారి ఆశలను క్రిమినల్ మైండ్ పక్కాగా ఉపయోగించుకుంది. తప్పుల్ని చూసీ చూడనట్లుగా వదిలేయడం అంటే… ఏదో ఓ చిన్న పొరపాటు చేయడం కాదు.. వ్యవస్థల్ని బలహీనం చేయడం. వైసీపీ హయాంలో రాజకీయదౌర్జన్యానికి.. దోపిడీ తనానికి అండగా నిలిచిన ప్రతి ఒక్క సివిల్ సర్వీస్ అధికారి పాపం ఇది. తాము కూర్చున్న చెట్టునే నరుక్కున్న విధంగా ప్రజల్లో తమపై వ్యతిరేకతపెరిగేలా.. నమ్మకం పోయేలా చేసుకున్నారు. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్లకు గతంలో ఉన్నంత గౌరవం లేదనే సంగతి వారికీ అర్థమవుతుంది.
Read Also : ఏపీ బ్రాండ్ ను మళ్లీ పూర్వపు స్థితికి తీసుకురావాలి : కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
వ్యవస్థలో ఓ సారి అరాచకం చొరబడితే బాగు చేయడం అంత తేలిక కాదు !
జగన్ హయాంలో కొంత మంది అలా చేయడం వల్ల ఇప్పుడు… రాజకీయ నేతలు మరింత బలం పుంజుకున్నారు. తాము చెప్పింది చేస్తారా చస్తారా అని పీకల మీద కూర్చుకుంటారు.. ఎందుకంటే.. వ్యవస్థలో ఓ అవలక్షణం చొరబడినప్పుడు… అది తమకు ఉపయోగపడుతున్నప్పుడు… అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఎంతో మంది రాజకీయ నేతలు ఉంటారు. గతంలో చేశారు కదా.. ఇప్పుడెందుకు చేయరని ప్రశ్నిస్తారు. గతంలో చేసిన వారిపై ఏ చర్యలు లేవు కాబట్టి ఇప్పుడు చేస్తే తప్పేమిటన్న భావనకు వచ్చి వ్యవస్థను మరింత దిగజార్చేస్తారు. దీన్ని ఆపడం అంత తేలిక కాదు. ఈ పతనంలో నలిగిపోయేది మాత్రం సామమాన్య ప్రజలే.
వ్యవస్థపై నమ్మకం పెంచుకోవాల్సిన బాధ్యత ఐఏఎస్, ఐపీఎస్లదే !
ఏ వ్యవస్థ అయినా బలంగా ఉండాలి అంటే.. అందులో ని వ్యక్తులే కీలకం. వారు ఎంత పవర్ ఫుల్ గా తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తారో వ్యవస్థలు కూడా అంత బలంగా ఉంటాయి. తమలో నిజాయితీ ఎంత బలంగా ఉంటే… ఆ అధికారాలకు అంత పవర్ వస్తుంది. లేకపోతే.. వ్యవస్థ మొత్తం కళ్లిపోతుంది. ఏపీలో ఆలిండియా సివిల్ సర్వీస్ అధికారులు ఐదేళ్లు చేసిన నిర్వాకంతో ప్రజలకు జరిగిన నష్టంతో పాటు వారి వ్యవస్థకే చెదలు పట్టింది. మొత్తం సంస్కరించుకోవాల్సి ఉంది. మళ్లీ ప్రజల్లో నమ్మకం కలిగించుకోవాల్సి ఉంది.