భారత రాష్ట్ర సమితి నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా అనర్హతా వేటు వేయిస్తామని కేటీఆర్ అదే పనిగా చెబుతున్నారు. పార్టీ మారకుండా .. ఆ ఆలోచనల్లో ఉన్న వారిని ఆపేందుకు ఈ బెదిరింపు మార్గాన్ని కేటీఆర్ ఎంచుకున్నట్లుగా కనిపిస్తున్నారు. కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు. స్పీకర్ ను కలుస్తున్నారు. గవర్నర్ కు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ ఆయన ఎన్ని చేసినా స్పీకర్ అనుకోకపోతే అనర్హతా వేటు వేయించలేరనేది రాజకీయంగా అందరికీ తెలిసిన విషయం. స్పీకర్ అలాంటి పని చివరి వరకూ చేయరు. దీనికి కారణం ఫిరాయింపుల నిరోధక చట్టం.
Read Also : బీఎల్ సంతోష్ ఇక్కడ..కేటీఆర్ అక్కడ.. ఏం జరుగుతోంది!
ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ప్రజాప్రతినిధిగా ఎన్నికల పార్టీకి రాజీనామా చేసినా ఇతర పార్టీ సభ్యత్వం తీసుకున్నా అనర్హులవుతారు. అంటే… ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు అనర్హతా వేటుకు గురయ్యే అర్హత సాధించినట్లే. కానీ అదే చట్టంలో అనర్హతా వేటు ఎవరు వేయాలో నిర్దేశించారు. ఎవరు అంటే స్పీకర్. స్పీకర్ నిర్ణయమే ఫైనల్. పార్టీ ఫిరాయింపుల విషయంలో గతంలో బీఆర్ఎస్ స్పీకర్లూ అదే చేశారు. ఇప్పటి స్పీకర్ అదే సంప్రదాయాన్నిపాటిస్తారు.
సుప్రీంకోర్టు అయినా ఫలానా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించలేదు. ఆదేశించినా ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇదే ఎన్నో కేసుల్లో నిరూపితమయింది. అయినా సుప్రీంకోర్టుకు వెళ్తామని కేటీఆర్ అంటున్నారు. ఎలా చూసినా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారమే ఫైనల్. ఆయన తన పార్టీ నిర్ణయం.. గత సంప్రదాయాల ప్రకారమే వ్యవహరించే అవకాశం ఉంది. అంటే అనుకుంటే తప్ప… ఎవరిపైనా అనర్హతా వేటు పడే అవకాశం లేదనేది ఎక్కువ మంది అభిప్రాయం. అయినా కేసీఆర్ తన అస్త్రాల్ని మాత్రం వదలడం లేదు.