ఏపీలో మరో ఎన్నిక వచ్చేసింది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. వైసీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రంగంలో ఉండబోతున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పలుకుబడి ఉన్న నేతగా పేరున్న బొత్సను జగన్ బరిలో నిలపగా, కూటమి అభ్యర్థి ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది.
స్థానిక సంస్థల్లో మెజారిటీ బలం వైసీపీకే ఉన్నా… ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విశాఖను రాజధానిని చేస్తానంటూ స్వయంగా జగన్ ప్రకటించాక, తను ఉండేందుకు ప్యాలెస్ కూడా సిద్ధం అవుతుంది ఇక విశాఖ నుండే పరిపాలన వైసీపీ నేతలు చెప్పుకున్నా జనం నమ్మలేదు. ఫలితంగా ఇప్పుడు పోటీలో ఉంటున్న బొత్సతో పాటు తన భార్య కూడా ఓడిపోవాల్సి వచ్చింది.
ఎన్నికల ఫలితాల తర్వాత క్యాడర్ తో పాటు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలంతా కూటమి వైపు వచ్చేసిన వారే. దీంతో కూటమి విజయం తప్పదు అనుకుంటున్న సందర్బంలో… బొత్స ఎత్తుకున్న కొత్త రాజకీయం పనిచేస్తుందా అన్న చర్చ మొదలైంది.
మా పార్టీకి మెజారిటీ ఉంది… కూటమి పార్టీలకు లేదు. ఇప్పుడు ఓట్లు కొనేందుకు వస్తున్నారు అంటూ బొత్స ప్రచారం మొదలుపెట్టారు. నేతలందరితోనూ ఒకటే మాట… ఓట్లు కొంటున్నారు అని. ఎన్నికలకు ముందు వాగ్ధానాలు ఇచ్చారు, ఇప్పుడు గల్లా పెట్టే ఖాళీ అయిందంటున్నారు… కానీ ఓట్లు మాత్రం కొంటున్నారు అంటూ బొత్స ప్రచారం చేస్తున్నారు.
బొత్స ఆరోపణలకు కూటమి కూడా అంతే ధీటుగా స్పందిస్తోంది. ఓడిపోయిన మళ్లీ పాత పాటే పాడుతున్నారు.. ఈసారి ఓటమితే బొత్సకు రాజకీయ సన్యాసం తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు.