బంగ్లాదేశ్ పరిణామాలపై భారత్ లో జరుగుతున్న ప్రచారం ప్రపంచాన్ని సైతం నివ్వెర పరుస్తోంది. అక్కడ జరుగుతోంది వేరు.. భారత్ లో జరుగుతున్న ప్రచారం వేరు. ఓ పద్దతి ప్రకారం బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు అంటూ ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. జరుగుతున్న ప్రతి మరణం హిందువులదేనని రెచ్చగొడుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ.. ఓ వ్యవస్థీకృతమైన ప్రయత్నం మాత్రం జరుగుతోందని అర్థమవుతోంది.
బంగ్లాదేశ్‌లో జరుగుతోంది హిందువులపై దాడులు కాదు. అక్కడ రిజర్వేషన్ల అంశంపై ప్రబలిన వ్యతిరేకత వల్ల… అంతకు ముందు ఏళ్ల తరబడి ప్రభుత్వంపై గూడుకట్టుకున్న అసంతృప్తి ఒక్క సారిగా బయటపడటం, ఆర్మీ చేసిన కుట్రల ఫలితంగానే బంగ్లాదేశ్‌కు ఈ దుస్థితి వచ్చింది. నిప్పు అంటించారు కానీ ఆర్పడం వారి వల్ల కావడం లేదు. దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల్లో వందల మంది చనిపోతున్నారు. ఆపడానికి సైన్యం వల్ల కూడా కావడం లేదు.
Read Also : బంగ్లాదేశ్ ఇష్యూపై భారత్ కీలక ప్రకటన
ఈ గొడవల్లో హిందువులే కాదు.. ముస్లింలు కూడా చనిపోతున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రచారం వేరు. ఏదైనా ఇల్లు తగలబడుతూంటే.. అది హిందువు ఇల్లు అని ప్రచారం చేస్తున్నారు. గతంలో ఎప్పుడో ఓ క్రికెట్ ఇంటికి నిప్పు పెట్టారు. దాన్ని ఇప్పుడు ప్రచారంలోకి తెచ్చి లిట్టన్ దాస్ అనే హిందూ క్రికెటర్ ఇంటికి నిప్పు పెట్టారని ప్రచారం చేస్తున్నారు. నిజానికి ముస్లిం క్రికెటర్‌దే. పైగా ఇప్పటిది కాదు. సోషల్ మీడియాలో మేము బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులమని కాపాడాలని కొన్ని వీడియోలు వస్తున్నాయి. కానీ వారు బంగ్లాదేశీయులు కాదు ఇండియన్సే.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులటూ భారత్ లో జరుగుతున్న ప్రచారం.. బంగ్లాదేశీ హిందువులకు పెను ప్రమాదంగా మారింది.అక్కడి అల్లరి మూకలు ఆ ప్రచారాన్ని నిజం చేస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. అందుకే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. లేని ప్రచారాల్ని చేయడం వల్ల అక్కడి హిందువుల్ని రిస్కులో పెట్టడం తప్ప.. మరే ప్రయోజనం ఉండదు. ఇక్కడేమైనా రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తారేమో కానీ.. మొత్తానికి ఈ తప్పుడు ప్రచారం బంగ్లాదేశ్ హిందువులకు సమస్యగా మారుతోంది.