ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతం గత పదేళ్లుగా ఎప్పుడూ ప్రచారంలోనే ఉంది కానీ ఆ ప్రాంతం అదృష్టం మారడం లేదు. పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటం.. ఎయిర్ స్ట్రిప్ ఉండటంతో అక్కడ పారిశ్రామిక విప్లవం వస్తుందని అనుకున్నారు. అసలు మొదట రాజధానిని అక్కడే పెడతారని అనుకున్నారు. రాజధాని ప్రచారంతో దొనకొండ చుట్టుపక్కల భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. కానీ రాజధాని రాలేదు. అయితే వచ్చిన ప్రభుత్వం దొనకొండను పారిశ్రామిక ప్రాంతం చేయాలని అనుకుంది. కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదు.
ఈ సారి ముఖ్యమంత్రి చంద్రబాబు దొనకొండ రాత మార్చాలని డిసైడయ్యారు. కొతత్గా ఆ ప్రాంతాల్లో పారిశ్రామిక్ క్లస్టర్ ఏర్పాటు చేయనన్నారు. దొనకొండను పారిశ్రామిక ప్రాంతం చేస్తామని వచ్చే అన్ని ప్రభుత్వాలు చెబుతూంటాయి. గత ప్రభుత్వాల్లో దొనకొండ మండలం రామక్కపల్లిలోని 44 ఎకరాల్లో చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఏపీఐఐసీ 268 ప్లాట్లుగా చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇస్తామని చెప్పి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించి.. 210 ప్లాట్ల కేటాయింపులు జరిపింది. పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా మౌలిక వసతుల కల్పనకు 6 కోట్ల రూపాయల నిధులు సైతం మంజూరయ్యాయి. కానీ రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఇక దొనకొండ జాతకం మారదా అనుకున్నారు.
Read Also : ఏపీ దొనకొండ తుగ్లక్ దౌల్తాబాద్లా ఉంటుందా?
కానీ చంద్రబాబు సీఎం అయ్యాక మళ్లీ ఆశలు చిగురించాయి. కేంద్ర వవిమానయాన మంత్రిగా రామ్మోహన్ ఉండటంతో దొనకొండ విమానాశ్రయానికి మళ్లీ మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన అంతర్గత ప్రక్రియ ప్రారంభమయింది. దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్ కోసం గతంలో అధికారులు, కేంద్ర బృందాలు సర్వేలు చేశాయి. దొనకొండపై రాష్ట్ర పరిశ్రమల శాఖ నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంతో పాటు పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ సర్కార్ తెలిపింది.
దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమి వేల ఎకరాల్లో ఉండటం, అనువైన ప్రాంతంగా కావడంతో క్లస్టర్ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. డిఫెన్స్ క్లస్టర్ ఏర్పడినట్లైతే రక్షణరంగ ఉత్పత్తుల తయారీ సంస్థలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఇతర ఏరో స్పేస్ పరిశ్రమలు అక్కడ తమ యూనిట్లను ఏర్పాటు చేస్తాయి. దొనకొండకు అతిచేరువలో ఉన్న కృష్ణపట్నం, రామాయపట్నం చెన్నై పోర్టుల నుంచి ఎగుమతి, దిగుమతులకు మంచి అవకాశాలున్నాయి.
ఎలా చూసినా దొనకొండ ప్రాంతాన్ని ఇక ఏ ప్రభుత్వమూ నిర్లక్ష్యం చేయలేదని ఆ ప్రాంతం .. పారిశ్రామికంగా ఎదగడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. సరైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే వచ్చే ఐదేళ్లలలో దొనకొండ అత్యంత విలువైన పారిశ్రామిక ప్రాంతంగా మారే అవకాశంఉంది.