తెలుగు స్టార్లు బాలీవుడ్ హీరోల్ని ఎప్పుడో మించిపోయారు. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్… వీళ్ల హవా బాలీవుడ్ లో ఎక్కువగా కనిపిస్తోంది. వీళ్ల సినిమాల గురించి అక్కడ ఎదురుచూడడం మొదలెట్టారు. పారితోషికంలోనూ, స్టార్ డమ్‌లోనూ మన హీరోలు ఎవరికీ తీసిపోరిప్పుడు. అందుకే బాలీవుడ్ నిర్మాతలు మన హీరోలపైపు దృష్టిసారిస్తున్నారు. టోకెన్ అడ్వాన్సులు ఇచ్చి మరీ కర్చీఫ్‌లు వేసుకొంటున్నారు. ఇప్పుడు కరణ్ జోహార్ కూడా అదే పనిలో ఉన్నాడు. తెలుగు నుంచి బాలీవుడ్ కు ఓ సినిమా వస్తోందంటే… కరణ్ అలెర్ట్ అయిపోతాడు. ఆ సినిమాలో ఏదో రూపంలో తన పేరు ఉండేలా చూసుకొంటాడు. అయితే నేరుగా మన హీరోలతో సినిమాలు చేయలేదు. ఇప్పుడు అందుకోసమే సమాయాత్తం అవుతున్నాడు.
టాలీవుడ్ లోని ముగ్గురు ప్రముఖ హీరోలకు కరణ్ అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వాళ్లతో నేరుగా ఓ హిందీ సినిమా కానీ, లేదంటే పాన్ ఇండియా సినిమాకానీ చేయడం కరణ్ ప్లాన్. ఆ ముగ్గురు హీరోలకు సరిపోయే కథల్ని వెదుకుతున్నాడు. ఈ మగ్గురు హీరోలు ఎప్పుడు ముంబై వెళ్లినా కరణ్‌తో భేటీ వేసి వస్తున్నారని, కరణ్ కొంతమంది దర్శకులతో కథలు చెప్పిస్తున్నాడని, అయితే ఇప్పటి వరకూ ఒక్క కథ కూడా సెట్ కాలేదని తెలుస్తోంది. ఈ ముగ్గురు హీరోలతోనే కాదు, తెలుగులో మిగిలిన టాప్ హీరోలందరి కోసం కరణ్ స్టోరీలు సిద్ధం చేయిస్తున్నాడట. హైదరాబాద్ లో కూడా ఓ ఆఫీస్ తెరిచే ఉద్దేశ్యాలు కరణ్‌కి ఉందని, అయితే ఓ ప్రాజెక్ట్ సెట్ అయిన తరవాతే.. హైదరాబాద్ లో బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకొంటున్నాడని తెలుస్తోంది. కరణ్ ప్లాన్ వర్కవుట్ అయితే, మెల్లమెల్లగా మిగిలిన పెద్ద నిర్మాణ సంస్థలన్నీ ఇదే దారిలో ఆలోచించే అవకాశాలు ఉన్నాయి.