నాగార్జున సాగర్ నిండిపోయింది. పులిచింతల ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారిపోయింది. ఇంకా పై నుండి వరద వస్తూనే ఉంది. ఇక వచ్చిన వరద వచ్చినట్లు సముద్రంలోకి వదిలేయాల్సిందే. దీంతో సాగర్ పై ఆధారపడ్డ రైతాంగం అంతా ఇప్పుడు వరి నాట్లు వేసేందుకు రెడీ అయ్యారు.
దీంతో పల్నాడు జిల్లాలో వరి విత్తనాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. డిమాండ్ ఒక్కసారిగా, ఊహించని విధంగా పెరగటంతో అధికారులు రైతులందరికీ విత్తనాలు అందేలా టోకెన్ల ద్వారా బ్యాగులు జారీ చేస్తున్నారు.
అయితే, ఇప్పుడు పంట వేయటం కాస్త ఆలస్యం కావటంతో… వేసవిలో కాస్త లేటుగా వరి పంట చేతికి వస్తుంది. దీంతో త్వరగా పంట చేతికొచ్చే జగిత్యాల సన్నాల రకం విత్తనాలు కావాలని రైతులు కోరుతున్నారు. దీంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవటంతో ప్రైవేటులో కూడా విత్తనాలు దొరకని పరిస్థితి నెలకొంది.
నిజానికి మార్కెట్ లో సరిపడా వరి విత్తనాలున్నా… ఒక్క జగిత్యాల సన్నరకానికే రైతులు మొగ్గుచూపటంతో ఇబ్బంది మొదలైంది.
అది కరీంనగర్ లోని జగిత్యాలలో దొరికే విత్తనమని… దానికి గతంలో తక్కువగా డిమాండ్ ఉండేదని, కానీ ఇప్పుడు త్వరగా పంట చేతికొస్తుందన్న కారణంగా రైతులంతా అడగటంతో సప్లై తక్కువగా ఉందని అధికారులు అంటున్నారు.