టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం కొనసాగుతోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం కావడం ఇదే మొదటిసారి. దీంతో ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా నామినేటెడ్ పదవుల భర్తీ, తెలంగాణలో టీడీపీ అధ్యక్షుడి నియామకం , విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిపై ఈ సమావేశంలో చర్చిచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
నామినేటెడ్ పదవుల కోసం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు వేచిచూస్తున్నారు. ప్రధానంగా మొన్నటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన పార్టీ నేతలు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. చంద్రబాబు కూడా నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టాలని భావిస్తుండటంతో ఈ పోలిట్ బ్యూరో సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
Also Read : ఎన్నికలకు ముందే ఎమ్మెల్సీ రిజల్ట్ వచ్చేస్తోంది!
నామినేటెడ్ పదవుల్లో టీడీపీకి 60%, జనసేనకు 30%, బీజేపీకి 10% చొప్పున ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ భేటీలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక, టీటీడీ చైర్మన్ పదవిపై రోజుకో పేరు ప్రచారంలోకి వస్తోంది. కానీ, చంద్రబాబు ఇప్పటికే ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నారని.. ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరితే టీటీడీ చైర్మన్ పేరును అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
మరోవైపు తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలని తెలంగాణ నేతల విజ్ఞప్తులతో.. అక్కడ పార్టీకి నూతన అధ్యక్షుడి ఎంపికపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని అంటున్నారు. ఇప్పటికే కొంతమంది పేర్లు చందబాబు పరిశీలనలో ఉన్నాయని, తెలంగాణకు చెందిన పార్టీ నేతలతో చర్చించి అధికారికంగా పేరును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. వైజాగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.