ఈరోజు ఉదయం నుంచి ఓ వార్త టాలీవుడ్ అంతా చక్కర్లు కొడుతోంది. నాగచైతన్య – శోభిత ధూళిపాళ నిశ్చితార్థానికి ముహూర్తమ్ కుదిరిందని, ఈరోజే ఆ లాంఛనం పూర్తి చేస్తారన్నది ఆ వార్తల సారాంశం. సమంతతో విడాకుల తరవాత చైతూ శోభితతో ప్రేమలో పడ్డాడని, ఇద్దరూ పెళ్లి కూడా చేసుకొంటారన్న గాసిప్పులు గట్టిగానే వినిపించాయి. వీళ్లిద్దరూ తరచూ జంటగా కనిపించడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. అయితే చైతూ ఎప్పుడూ ఈ విషయంపై నోరు విప్పలేదు. తమ పర్సనల్ లైఫ్ తమకుందని, వ్యక్తిగత విషయాల్లో తమకు ప్రైవసీ కావాలంటూ జవాబు దాటవేసేవాడు. శోభిత కూడా ఈ విషయమై ఎప్పుడూ స్పందించిందే లేదు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఇద్దరూ సంప్రదాయబద్ధంగా ఒక్కటయ్యేందుకు రంగం సిద్ధం చేసుకొన్నారు. ఈరోజు ఉదయం 9 గంట 42 నిమిషాలకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని, తమ కుటుంబంలోకి శోభితను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామంటూ నాగార్జున ట్వీట్ చేశారు. నిశ్చితార్థం ఫొటోల్ని కూడా నాగార్జున సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు. దాంతో ఈ నిశ్చితార్థం అఫీషియల్ అయిపోయింది. అయితే పెళ్లెప్పుడన్నది చెప్పలేదు. బహుశా ఈ యేడాదే వీరిద్దరి వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైతూ ప్రస్తుతం `తండేల్` షూటింగుతో బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ పూర్తయిన వెంటనే.. లేదంటే షెడ్యూల్ గ్యాప్లోనో చైతూ – శోభితల వివాహం జరిగొచ్చని సన్నిహితులు చెబుతున్నారు.
మరి పెళ్లెక్కడ?
చైతూ తన పెళ్లి విషయంలో ముందే గట్టిగా ప్లానింగులు చేసుకొన్నట్టు తెలుస్తోంది. పెళ్లి ఎప్పుడు జరిగినా, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో చేసుకోవాలనుకొంటున్నాడట. అది కూడా ఇక్కడ కాదు. విదేశాల్లో. అందుకు ఇరు కుటుంబ సభ్యులూ తమ సమ్మతిని తెలియజేశారని సమాచారం. నిజానికి నిశ్చితార్థం జరిగిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచాలనుకొన్నారని, అయితే సోషల్ మీడియా ద్వారా ముందే ఈ విషయం బయటకు పొక్కిపోవడంతో బయటపెట్టారని, పెళ్లి కూడా ఎలాంటి ఆర్భాటాలూ లేకుండా చేస్తారని సమాచారం అందుతోంది.