హైదరాబాద్కు నీళ్లు తరలించేందుకు నల్లగొండజిల్లాలో నిర్మిస్తున్న సుంకిశాల ఇంటేక్ వెల్ రిటైనింగ్ వాల్ కుప్పకూలిన వ్యవహారంలో అసలు తప్పు కాంట్రాక్టర్ మేఘాదేనని తేలిపోయింది. బీఆర్ఎస్ హయాంలోనే సుంకిశాలను పట్టాలెక్కించారు. మేఘాకు కాంట్రాక్ట్ ఇచ్చి నిర్మాణాలు ప్రారంభించారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చేసిందేమీ లేదు. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకుండా మేఘా చేస్తున్న పనుల వల్ల పెను ప్రమాదం సంభవించింది.
నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తోడుకుని హైదరాబాద్ తరలించేందుకు సుంకిశాల ఇంటేక్ వెల్ నిర్మిస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు పనులకు ఆటంకం రాకుండా ముందుగా రిటైనింగ్ వాల్ నిర్మించారు.. అయితే ఇప్పుడు వస్తున్న వరదలకు ఆ రీటైనింగ్ వాల్ తట్టుకోలేకపోయింది. ఫలితంగా కుప్పకూలిపోయింది. కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
తెలంగాణలో చిన్నా పెద్దా కాంట్రాక్టులన్నీ మేఘా కంపెనీవే. కానీ పర్ ఫెక్ట్ గా నిర్మించిన ప్రాజెక్టు ఒక్కటీ లేదు. రిటైనింగ్ వాల్ బలంగా నిర్మించలేని మేఘా కంపెనీ పోలవరం పనుల్ని అతి తక్కువకు చేస్తామని రివర్స్ టెండరేసి దక్కించుకుంది. అయితే మేఘా పవర్ వేరే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారికి పోయేదేమీ లేదు. ఎలా డీల్ చేయాలో ఆలా డీల్ చేసుకుంటారు. దానికి సుంకిశాలపై రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నాయి కానీ.. ఎవరూ మేఘా దగ్గరకు వెళ్లకపోవడమే సాక్ష్యం.