హైదరాబాద్ నగరాన్ని మరింత విస్తరించేలా నిర్మంచాలనుకుంటున్న ఇన్నర్ రింగ్ రోడ్ ఓ మహా యజ్ఞంగా మారనుంది. కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో జరిగిన చర్చలు ఆర్ఆర్ఆర్ ప్రక్రియ వేగవంతానికి అడుగులు పడ్డాయి. ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి, రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి తేడా ఉంది. ఓఆర్ఆర్ కేవలం 180 కిలోమీటర్లు అయితే, ఆర్ఆర్ఆర్ దాదాపు 350 కిలోమీటర్లు ఉంటుంది. అంటే దాదాపు రెండింతలు ఎక్కువ. భూసేకరణ ఆషామాాషీ కాదు. రైతులు ఎక్కడికక్కడ వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. కోర్టుల్లో కేసులు పడతాయి.
ఆర్ఆర్ఆర్కు భూసేకరణకు అనేక అడ్డంకులు ఉన్నాయి. ఉత్తర, దక్షిణ భాగాల్లో భూసేకరణకే దాదాపు రూ. 5000 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇందులో 50:50 నిష్పత్తి చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. రాష్ట్ర వాటా 50 శాతం అంటే రూ. 2500 కోట్లు ముందుగానే ఎన్హెచ్ఏఐ ఖాతాలో డిపాజిట్ చేయాలని కేంద్రం సూచించింది. బడ్జెట్లో ఆర్ఆర్ఆర్ భూసేకరణ కోసం రూ. 100 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది.
మొత్తం ప్రాజెక్టుకు 4781 ఎకరాల భూమికి గాను ఇప్పటివరకు 1459 ఎకరాలను మాత్రమే సేకరించారు. భూసేకరణను వచ్చే సెప్టెంబరు నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అక్టోబరులో ప్రధానితో శంకుస్థాపన చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వాలు తొందర పెడుతున్నా, ఆచరణలో భూసేకరణ అంత సులభం కాదని చెబుతున్నారు. ఓఆర్ఆర్లో తలెత్తిన సమస్యలకంటే, ఆర్ఆర్ఆర్ భూసేకరణలో ఆ సమస్యలు ఎక్కువగా వస్తాయి.
తొలుత ఆర్ఆర్ఆర్ రెండు భాగాలకు కలిపి రూ. 26 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. తాజాగా పనులు ప్రారంభం కాకముందే ఆ అంచనాలు రూ.30 వేల కోట్లకు చేరుతున్నాయి. ప్రణాళికా దశలోనే తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఆర్ఆర్ఆర్ను 2018లో ప్రతిపాదించారు. ఇప్పటికి ఆరేళ్లు. కానీ ఇంకా శంకస్థాపన వరకూ రాలేదు. ఇక నిర్మాణం పూర్తయి ప్రారంభం కావాలంటే ఎంత కాలం పడుతుందో అంచనా వేయడం కష్టం.