ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు చకచక అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మెగా డీఎస్సీ, ఫించన్ పెంపు వంటివి అమలు చేస్తున్న కూటమి సర్కార్ మరో కీలకమైన హామీని నెరవేర్చేందుకు సమాయత్తం అవుతోంది.
కూటమి అధికారంలోకి వస్తే రైతులకు ప్రతీ ఏటా 20వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ పథకం అమలు దిశగా చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇందుకోసం మార్గదర్శకాలు రూపొందించాలని స్పష్టం చేశారు. రైతు భరోసా కింద ఎవరెవరికి సాయం అందించాలి? ఏ అర్హత ప్రాతిపదికన లబ్దిదారులను గుర్తించాలి అనే అంశంపై మార్గదర్శకాలు సిద్దం చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు, ఇటీవల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పంట నష్టపోయిన రైతులకు రాయితీలు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు విపత్తుల సహాయ నిధి నుంచి రూ 36కోట్లు విడుదల చేయాలని ఆర్ధిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు సంవృద్దిగా కురుస్తుండటంతో విత్తనాల కొరత రాకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను చంద్రబాబు ఆదేశించారు.