పులివెందుల ఎమ్మెల్యే జగన్ వరుసగా బెంగళూరుకు వెళ్తున్నారు. ఆయన ఎందుకు ఈ రాకపోకలు కొనసాగిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ, తాజాగా ఆయన బెంగళూరు పర్యటన మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో బిగ్ డిబేట్ గా మారింది.
గురువారం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై పార్లమెంట్ లో ఇండియా కూటమి వాదనతో జతకలిపింది వైసీపీ. సరిగ్గా ఆరోజే జగన్ బెంగళూరు పర్యటన ఖరారు కావడం ఆసక్తికరంగా మారింది. ఇది అప్పటికప్పుడు ఫిక్స్ చేసుకున్న షెడ్యూలా అనే విషయంలో క్లారిటీ లేకపోయినా..ఇండియా కూటమి వైపు జగన్ అడుగులు వేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో.. పార్లమెంట్ లో ఇండియా కూటమికి మద్దతుగా నిలవడం, ఆ తర్వాతే ఈ పర్యటన వివరాలు బయటకు రావడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.
ఇప్పటికే 40 రోజుల్లో నాలుగుసార్లు బెంగళూరు వెళ్ళిన జగన్ అక్కడ ఎవరిని కలుస్తున్నారు అనేది క్లారిటీ లేదు. ఈసారి మాత్రం కాంగ్రెస్ నేతలు కొంతమంది ఢిల్లీ నుంచి వచ్చి బెంగళూరులో జగన్ తో భేటీ అవుతారనే ప్రచారం ఊపందుకుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా జగన్ ను కలిసి ఇండియా కూటమిలో చేరాలని ఆహ్వానిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన ఈ బెంగళూరు పర్యటన ద్వారా అనేక ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం బీజేపీతో కలిసి కొనసాగాలనుకున్నా అదే కూటమిలో టీడీపీ ఉండటంతో వైసీపీకి ప్రాధాన్యత ఉండదు. మరోవైపు ఏ కూటమిలో చేరకుండా ఒంటరి రాజకీయం చేయడం భవిష్యత్ లో మరిన్ని సమస్యలను తెచ్చి పెడుతుందనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ కారణంగానే ఇండియా కూటమితో దోస్తీ చేయాలని జగన్ ఫిక్స్ అయ్యారని.. అందుకోసమే ఈ వరుస బెంగళూరు పర్యటనలు అంటున్నారు.