నా సాహిత్యం మొత్తం ఈనాడు నుంచి నేర్చుకున్నదేనని ఆస్కార్ పాటల రచయిత చంద్రబోస్ నిర్మోహమాటంగా చెబుతారు. ఒక్క చంద్రబోస్ విషయంలోనే కాదు..ఇప్పుడు నలభైల్లో ఉన్న పాటల రచయితలు..మాటల రచయితలు..కథా రచయితలు.. అందరికీ ఈనాడు పంచిన .. పెంచిన జ్ఞానమే ఇందనం. ఇప్పుడు వయసు అయిపోయిన జర్నలిస్టుల దగ్గర నుంచి కొత్త తరం జర్నలిస్టులు అంతా ఈనాడు నుంచి ఊడి పడిన వాళ్లో..ఈనాడు చదువుకుని పైకి వచ్చిన వాళ్లో ఉంటారు. ఇప్పుడు నలభైల్లో ఉన్న తరానికి ఉన్న విజ్ఞానం అంతా ఈనాడు పంచిందేనంటే అతిశయోక్తి కాదు. సమాచార విప్లవం మొత్తం దినపత్రిక మాత్రమే అన్నట్లుగా ఉన్న రోజుల్లో ఈనాడు తెలుగు ప్రపంచాన్ని ఏలింది. అందరికీ విజ్ఞానాన్ని.. వినోదాన్ని.. సాహిత్యాన్ని పంచింది. ప్రతి ఒక్కరిగా ఈనాడు ప్రభావం ఎంతో కొంత ఉంటుందని చెప్పడం అతిశయోక్తి కాదు.
ఈనాడు ప్రారంచించి యాభై ఏళ్లు అయింది. ఓ సంస్థ.. అదీ మీడియా సంస్థ యాభై ఏళ్ల పాటు మనుగడ సాగించడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే.. ఈ మధ్య కాలంలో ఎన్నో పత్రికలు వచ్చాయి పోయాయి.. కానీ ఈనాడు మాత్రమే నిటారుగా నిలబడింది. దానికి కారణం రామోజీరావు ఆ పత్రికకు వేసిన విలువల పునాదులే. అప్పట్లో జిల్లాకు ఓ ఎస్పీకి.. ఓ కలెక్టర్ కు ఎంత పలుకుబడి ఉండేదో.. ఈనాడు జిల్లా స్టాఫర్కు అంతే గౌరవం ఉండేదంటే అతిశయోక్తి కాదు.కానీ ఏ ఒక్క రిపోర్టర్ కూడా తనకు ఉన్న ఈనాడు బలాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చేవి కావు. ఎందుకంటే.. కనీసం అక్రిడేషన్ కార్డు తీసుకుని ప్రయోజనాలు పొందేందుకు కూడా సంస్థ విలువలు అంగీకరించవు. నిబద్ధమైన రిపోర్టింగ్..నిజాలు బయటకు రావాలంటే .. ఎవరి దగ్గర ప్రయోజనాలు పొందకూడదన్నది ఈనాడు మొదట పెట్టుకున్న విలువ. ఇప్పటికీ అదీఉండబట్టే.. విజయవంతంగా ప్రస్థానం కొనసాగిస్తోంది.
ఈనాడు ఘనతల్ని కొత్తగా చెప్పడం అంటే ఎన్టీఆర్ జీవిత చరిత్రను మళ్లీ గుర్తుకు తెచ్చుకోవడమే. పత్రికా రంగం రాజ్యమేలిన కాలంలో ఓ తరం మొత్తాన్ని శాసించిన అక్షరం ఈనాడు. తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించి అక్షరాలను నిప్పు కణికల్లా మండించి యువతలో .. పట్టుదల, స్ఫూర్తి పెంచడంలో ఈనాడు పాత్ర ఎంతో కీలకం. తమపై ఈనాడు ఈ స్థాయిలో ముద్ర వేసిందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే.. ఈనాడులో వచ్చిన అక్షరాలు.. స్ఫూర్తి దాయక కథనాలతో ఎంతో మంది ప్రేరణ తెచ్చుకుంటారు.. వారి వల్ల తాము పట్టుదలగా ప్రయత్నించామని అనుకుంటారు. కానీ అలా ప్రజెంట్ చేసింది ఈనాడు.
యాభై ఏళ్ల ప్రస్థానంలో ఈనాడు తీర్చిదిద్దిన జీవితాలు ఎన్ని లక్షలు ఉంటాయో చెప్పడం కష్టం. కాల క్రమంలో వస్తున్న మార్పులతో.. ఈనాడు ఇప్పుడు పోటీ పడుతోంది. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ చెక్కు చెదరకుండా ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈనాడు పోషించిన పాత్రే దీనికి సాక్ష్యం. అయితే ఇప్పుడు గతంలోలా ఈనాడు మాత్రమే కాదు.. ఎన్నోరకాల సమాచార మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. పత్రికా రంగం వెనుకబడిపోతోంది. టీవీ.. సోషల్ మీడియా, యాప్స్.. ఇలా అనేక రంగాలుగా విస్తరించింది. అందుకే ఇప్పుడు ఈనాడును కొత్త తరం పూర్తి స్థాయిలో ఆస్వాదించలేదు. కొత్త తరానికి తీరిగ్గా పేపర్ చదివే తీరిక ఉండటం లేదు. కానీ ఈనాడు మాత్రం.. మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ.. తాను ఎంత ముఖ్యమో నిరూపిస్తూనే ఉంది.
ఈనాడు అంటే తెలుగు ప్రజలకు ఓ ఎమోషన్. పొద్దన్నే ఈనాడు పేపర్ చదవని వారికి ఏదోవెలితి ఉంటుంది . ఇప్పుడు చాలా మంది నెట్ ఎడిషన్లకు మారొచ్చు..కానీ ఆ అలవాటు కూడా మారదు. ఇలా మారుతున్న టెక్నాలజీని అంది పుట్టుకుని.. తెలుగు వారికి మరో యాభై ఏళ్ల పాటు అమూల్యమైన సమాచార సేవ చేస్తుందని ఆశిద్దాం…!
50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈనాడు యాజమాన్యానికి కాకుండా.. తెలుగు వారందిరికీ శుభాకాంక్షలు చెప్పడం సముచితం. ఈనాడు అర్థ శతాబ్ది సందర్భంగా తెలుగు వారంందరికీ హార్దిక శుభాకాంక్షలు.