తెలుగుదేశం పార్టీ అంటే ఓ ఊరి కోసమో, ఓ కులం కోసమో, ఓ ప్రాంతం కోసమో, ఓ రాష్ట్రం కోసమో పెట్టింది కాదు… ఇది తెలుగు ప్రజల కోసం పెట్టిన తెలుగువారి అందరి పార్టీ అని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
తెలంగాణ అయినా, ఏపీ అయినా తెలుగువారే… ఎక్కడున్నా తెలుగువారు నెం.1గా ఉండాలన్నదే తమ లక్ష్యమని, నేను సీఎంగా ఆనాడు వేసిన పునాదులపై తర్వాత వచ్చిన సీఎంలు పనిచేయటం వల్లే ఈరోజు గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక కన్నా తెలంగాణ తలసరి ఆదాయంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు.
విజన్ 2047తో ముందుకెళ్తున్నాం… అప్పటి వరకు ప్రపంచంలో భారతదేశం ముందు ఉండాలి అన్నది అందరి లక్ష్యం. అయితే, అందులో తెలుగువారు ముందు ఉండాలన్నది తన లక్ష్యం అని, అది తెలంగాణ రాష్ట్రం వారా ఏపీ వారా తర్వాత… నెల్లూరు అయినా, నల్గొండ అయినా తర్వాత… తెలుగువారు ఉంటే చాలు అని చంద్రబాబు స్పష్టం చేశారు.
తెలంగాణలోనూ టీడీపీ క్రీయాశీలకంగా పనిచేయాలి, పార్టీలో కొత్త ఉత్తేజం రావాలని కార్యకర్తలంతా కోరుతున్నారని… భవిష్యత్ లో అందుకు తగ్గట్లుగా నిర్ణయాలుంటాయన్నారు చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల సీఎంలుగా ఇచ్చి పుచ్చుకునే విధంగా ముందుకు వెళ్తామని మరోసారి క్లారిటీ ఇచ్చారు.