కర్నాటకలోని తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకపోవటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. విషయం తెలియగానే సీఎం చంద్రబాబు… జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్ తో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకోవటంతో పాటు కర్నూల్ జిల్లాలో ఉండే లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
తుంగభద్ర డ్యామ్ అధికారులతో మాట్లాడాలని మరో మంత్రి పయ్యావులను సీఎం ఆదేశించారు. అవసరం అయితే మన వంతు సహయం చేయాలని, వెంటనే మరమ్మత్తులు చేయాలని… లేకపోతే కర్నూల్ కు ముంపు ప్రభావం ఉంటుందని సూచించారు. అయితే, పాత డిజైన్ తో ఏర్పాటు చేసిన పాత గేటు అని, స్టాప్ లాక్ పద్దతిలో ఆ గేటును ఆపరేట్ చేయలేమన్నారు.
సీఎం ఆదేశాలతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల బృందం హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లింది. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశామని, కలెక్టర్ తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు మంత్రి రామానాయుడు తెలిపారు.
ఎక్కువ ఇబ్బంది అయినా సిద్దంగా ఉండేలా ఇటు శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల అధికారులను ఏపీ ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండుకుండలా ఉన్న నేపథ్యంలో… తుంగభద్ర డ్యాం గేట్లకు ఇబ్బంది అయినా వచ్చే వరదను తట్టుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.