రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో చేసుకుంటున్న ఒప్పందాలు ఎవరూ ఊహించనవి. అమెరికా పర్యటనను పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి జయేష్ రంజన్ అద్భుతంగా డీల్ చేస్తున్నారు . ముందుగానే ఆయన ఏర్పాట్లు చేసి పెట్టి పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిపోయేలా చేశారు. కానీ వాటికి ప్రచారం తెచ్చుకునే విషయంలో.. ప్రజలకు సమాచారం చేరే వేసే విషయంలో మాత్రం.. విఫలమయ్యారు. సాధించిన వాటిపై అసలు ప్రచారాలు చేసుకోకపోగా… నెగెటివ్ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.
పది రోజుల పర్యటనలో రేవంత్ రెడ్డి టీం మల్టినేషనల్ కంపెనీలు చాలా వాటిని కవర్ చేసింది. కొత్తగా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడమో… విస్తరించే ప్రణాళికలకో ఒప్పించగలిగారు. చాలా వాటికి ఎంవోయూలు చేసుకున్నారు. అదే కేటీఆర్ పర్యటనలో ఇలా జరిగి ఉంటే.. వచ్చే స్పందన వేరుగా ఉండేది. మొత్తం పాజిటివ్ ప్రచారం ఊపందుకునేంది. కానీ ఇప్పుడు అలా జరగకపోవడానికి ప్రధాన కారణం.. వీటిని సరిగ్గా చూసుకోవల్సిన పీఆర్ టీం విఫలం కావడమేనన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. కంపెనీలు… చేసుకున్న ఒప్పందాలు.. సమావేశాల వివరాలతో ఎప్పటికప్పుడు వీడియోలతో సహా అప్ డేట్స్ మీడియాకు అందాల్సి ఉంది. కానీ ఈ విషయంలో ఫెయిలయ్యారు. అంతే కాదు.. ఆయా కంపెనీల గొప్పతనమేంటో … హైదరాబాద్కు వస్తే ఎంత లాభమో వివరించేలే చేయగలగాలి. కానీ ఆ దిశగా జరిగిన ప్రయత్నాలు స్వల్పమే.
పాజిటివ్ ప్రచారం జరగకపోగా.. ఒకటి, రెండు కంపెనీల పేర్లను చూపించి పూర్తిగా నెగెటివ్ ప్రచారం చేయడం ఇంకో మైనస్. స్వచ్చ బయోలో రేవంత్ రెడ్డి సోదరుడు ఓ డైరక్టర్ అన్న కారణంతో చేసిన వ్యతిరేక ప్రచారంతో మొత్తం పెట్టుబడుల టూర్ ను ఫేక్ గా ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రయత్నించింది. కానీ గట్టిగా తిప్పికొట్టడంలో ఫెయిలయ్యారు. గట్టిగా పని చేయడమే కాదు.. ఆ పని గురించి ప్రజలకు కూడా సమర్థంగా చెప్పుకోగలగాలన్న అభిప్రాయం .. రేవంత్ అమెరికా టూర్ విషయంలో కాంగ్రెస్ పార్టీలోనూ వినిపిస్తోంది.