ఓవైపు ఆర్థిక భారం, మరోవైపు బ్రాండ్ ఏపీ దెబ్బతినకుండా చర్యలు, ఇంకోవైపు సంక్షేమ పథకాలు… అన్నింటిని సమన్వయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే ప్రయత్నాల్లో ఉన్న కూటమి సర్కార్, తాజాగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ హామీపై ఫోకస్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలందరికీ ఉచితంగా అవకాశం ఇవ్వబోతున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించబోతున్నారు. కర్నాటక రాష్ట్రంలో ఫ్రీబస్ తో ఆర్టీసీ ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ అమలవుతున్న తీరుపై రవాణా శాఖ అధికారులు ఇప్పటికే నివేదికలు సిద్ధం చేశారు. తెలంగాణలో అమలవుతున్న ఫ్రీ బస్ పై సీఎం చంద్రబాబు ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన మీటింగ్ లో వాకబు చేశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఫ్రీ బస్ పై రివ్యూ తర్వాత కీలక ప్రకటన చేయబోతున్నారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు ప్రయాణిస్తున్న వారు ఎందరు? ఫ్రీ బస్ పెడితే సర్కార్ పై పడే భారం ఎంత? ఆర్టీసీని కాపాడుకుంటూ పథకం అమలు కావాలంటే ప్రతి నెల ఎంత ఖర్చు రావొచ్చు వంటి అంశాలపై చర్చించనున్నారు.
ఇప్పటికే ఆగస్టు 15 నుండి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది సర్కార్. ఫ్రీ బస్ పథకాన్ని కూడా అదే రోజు నుండి ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో అమలవుతున్న మార్గదర్శకాల్లోనే స్వల్ప మార్పులు చేర్పులతో పథకం ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది.