థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలకే ఈ రోజు ఆదరణ. విజువల్స్‌తో అబ్బుర పరిచే సినిమాలకే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్‌కి వెళ్లి, సినిమా చూడాలన్న ఉత్సాహం టీజర్, ట్రైలర్‌తోనే కలగాలి. అప్పుడే.. వాటిపై దృఫ్టి పెడుతున్నారు. ‘కంగువ’ అలాంటి ప్రయత్నమే చేసింది. సూర్య కథానాయకుడిగా స్టూడియో గ్రీన్ సంస్థ అత్యంత భారీ వ్యయంతో రూపొందించిన చిత్రమిది. శివ దర్శకత్వం వహించారు. అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రెండు నెలల ముందే ట్రైలర్ విడుదల చేసేశారు.
Also Read : ‘కంగువా’ గ్లింప్స్: ఓ సరికొత్త ప్రపంచం
‘కంగువ’ ఓ విజువల్ ఫీస్ట్ అని చిత్రబృందం ముందు నుంచీ చెబుతూనే ఉంది. 2 నిమిషాల 38 సెకన్ల ఈ ట్రైలర్లో అదే కనిపించింది. ప్రేక్షకుల్ని శతాబ్దాల వెనక్కి తీసుకెళ్లింది ట్రైలర్. అక్కడ కనిపించిన మనుషులు, వాళ్ల వేష భాషలు, యుద్ధ రీతి.. ఇవన్నీ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాయి. ట్రైలర్ చూస్తుంటే… అణగద్రొక్కబడిన ఓ వర్గం బానిస సంకెళ్లని తెంచే యోధుడి పాత్రలో సూర్య కనిపించబోతున్నాడన్న విషయం అర్థమైంది. యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేశారు. యుద్ధ సన్నివేశాలు రోమాంఛితంగా ఉన్నాయి. విల్లును చుట్టుకొన్న సర్పం, సముద్రంలో తేలియాడే చేతులు, చివర్లో మొసలితో సూర్య చేసే విన్యాసం ఇవన్నీ గుడ్లప్పగించి చూసేలా ఉన్నాయి. ట్రైలర్లో లెక్కలేనన్ని షాట్లు కనిపించాయి. సినిమాలో ఇంకెన్ని చూపిస్తారో..? శివ విజువల్ సెన్స్ బాగుంది. టేకింగ్, నేపథ్య సంగీతం ఇవన్నీ గూజ్బమ్స్ ఇచ్చేలా ఉన్నాయి. చివర్లో బ్లర్ విజువల్స్ మధ్య గుర్రం మీద ఎవరో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో కార్తీ ఓ అతిథి పాత్రలో కనిపిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. బహుశా.. ఆ విజువల్స్ కార్తీకి సంబంధించిందే అయ్యుంటుంది. బాడీ డియోల్ పాత్ర కూడా కొత్తగా, శక్తిమంతంగా తీర్చిదిద్దినట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఈమధ్య తమిళ సినిమాలు పెద్దగా జోరు చూపించడం లేదు. భారీ అంచనాలతో వస్తున్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ‘కంగువ’ అయినా ఆ లోటు తీరుస్తుందేమో చూడాలి.