థియేటర్లకు జనాలు రావడం లేదన్నది నిజం.
దానికి కారణం ఏమిటి? అని అడిగితే మాత్రం ‘థియేటర్లకు రావాలన్న మూడ్ జనాలకు లేదండీ’ అని సింపుల్గా తేల్చేస్తున్నారు.
ఓటీటీలకు ప్రేక్షకులు అలవాటు పడిపోయారు అని, అందుకే థియేటర్ల వరకూ రావడానికి ఇష్టపడడం లేదని చెప్పేస్తున్నారు.
అదే నిజమైతే రీ రీలీజులకు ప్రేక్షకులు ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు. ‘మురారి’ సినిమానే చూడండి. మహేష్ పుట్టిన రోజున ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే ఏకంగా రూ.7 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఈమధ్య ఏ చిన్న సినిమాకీ రాని కలక్షన్లు ఇవి. థియేటర్ల దగ్గర తోపులాటలు, జనం కిక్కిరిసిపోవడం, టికెట్ల కోసం గలాటా.. ఇవన్నీ కనిపించాయి. ‘మురారి’ అనే కాదు. పాత సూపర్ హిట్ సినిమాల్ని 4 కెలో రీ రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ పూనకాలు తెచ్చేసుకొంటున్నారు. ఓ కొత్త సినిమా విడుదల అవుతున్నప్పుడు లేని సందడి.. పాత సినిమాల విషయంలో కనిపిస్తోంది. ఇది చూసి కూడా `జనాలకు థియేటర్లకు వచ్చే మూడ్ లేద`ని చెబుతారా? ఇప్పుడు ఎవరైనా ఈ మాట నమ్ముతారా?
Also Read : ‘మురారి’ చూశాక కూడా ‘మూడ్’ లేదంటారా..?!
లేనిది జనాల్లో మూడ్ కాదు. సినిమాలో కంటెంట్. సరైన కథాబలం ఉన్న సినిమా వచ్చి ఎంతకాలమైంది? నిజంగా సినిమాలో కంటెంట్ ఉంటే, అందులో స్టార్ లేకపోయినా ఆ సినిమాని ఆశీర్వదిస్తారు. ‘మహారాజా’ అనే డబ్బింగ్ సినిమాని మన వాళ్లు ఆదరించలేదా? మరి మన సినిమాల్ని ఎందుకు చూడరు? ఓటీటీల ప్రభావం ఉన్న మాట వాస్తవమే. కానీ.. థియేటరికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాల్ని ప్రేక్షకులు వదులుకోవడం లేదు. టికెట్ రేట్ ఎక్కువ, తక్కువ అనే సంగతి చూడడం లేదు. ఇప్పటికీ పెరుగుతున్న టికెట్ రేట్ల గురించి అంతా మాట్లాడుకొంటూనే ఉంటారు. ఈమధ్య కాలంలో కొన్ని చిన్న సినిమాలు రేట్లు తగ్గించేశాయి. కొన్ని సినిమాలైతే రూ.50లకే సినిమా చూపించాయి. మరి ఆ సినిమాలకు జనాదరణ ఎందుకు లేదు. టికెట్ రేట్లు తగ్గించారు కదా, అని ఎందుకు వెళ్లలేదు? అంటే ఇక్కడ సమస్య టికెట్ రేట్ కాదు. సినిమాలోని కంటెంట్.
కంటెంట్ ఉన్న సినిమాల్ని ఇవ్వట్లేదన్న విషయాన్ని దర్శక నిర్మాతలు గుర్తించాలి. ఓటీటీని పెద్ద బూచిగా చూపించి, తప్పించుకొనే ప్రయత్నాలు మానుకోవాలి. పాత సినిమాల్ని రీ రిలీజ్ చేస్తేనే పనిగట్టుకొని వెళ్లి చూస్తున్న ఫ్యాన్స్ ఉన్న పరిశ్రమ మనది. అలాంటిది కొత్త తరహా సినిమాలు తీస్తే తప్పకుండా ఆశీర్వదిస్తారు. ఈ నిజాన్ని ఒప్పుకొని తీరాలి.