”మా సినిమా అంతా కొత్త కొత్తగా ఉంటుంది` అని చెప్పుకోవడంలో ఎలాంటి కొత్తదనం లేదు. అది అలవాటైన మాటే. అయితే ‘మాకు కొత్తగా ట్రై చేస్తే వర్కవుట్ అవ్వదు’ అని చెప్పినవాళ్లు ఎవరైనా ఉన్నారా? హరీష్ శంకర్ తప్ప. ఇలాంటి వెరైటీ స్టేట్ మెంట్లు హరీష్ మాత్రమే ఇవ్వగలడు. అయితే ఇది తన గురించి కాదు. రవితేజ గురించి చెప్పిన మాట. రవితేజ కొత్తగా ట్రై చేస్తే, జనం చూడరని, వర్కవుట్ అవ్వదని చెబుతూ అందుకు కొన్ని ఉదాహరణలు జోడించాడు.
ఇంతకీ హరీష్ ఏమన్నారంటే.. ”ఇడియట్ సినిమా చేసిన రవితేజ.. తర్వాత నా అటోగ్రాఫ్ అనే ఓ మంచి సబ్జెక్ట్ చేశారు. జనాలు చూడలేదు. తనని తాను కొత్తగా చూపించడానికి ‘శంభో శివ శంభో’ అనే సినిమా చేశారు. జనాలు ఆదరించలేదు. నిర్మాత ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. నేనింతే, టైగర్ నాగేశ్వర్ రావు, మొన్నటి ఈగల్ వరకూ చాలా కొత్త ప్రయత్నాలు చేశారు. ఆయన కొత్తగా ప్రయత్నించిన ప్రతి సినిమాని ఫ్లాఫ్ చేశారు. ‘ధమాకా’ లాంటి సినిమాలు హిట్టు అవుతున్నాయి. ప్రేక్షకులు అలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు” అన్నాడు హరీష్.
”నేను కూడా ఎదో ప్రయోగం చేద్దామని ఈ సినిమా చేయలేదు. నాకు ‘షాక్’ కొట్టింది చాలు. రవితేజ నుంచి ఆడియన్స్ ఏమీ కోరుకుంటారో అలాంటి ఎలిమెంట్స్ తోనే మిస్టర్ బచ్చన్ తీశాను’అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు హరీష్.