పేదల ఆకలి తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ఈ నెల 15న అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి విడతలో భాగంగా స్వాతంత్ర్య దినోత్సవం రోజున 100 అన్న క్యాంటీన్ లు అందుబాటులోకి రానున్నాయి.
ఉత్తరాంధ్ర జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో మిగతా జిల్లాలో ఈ అన్న క్యాంటీన్లను ప్రారంభించనుంది ప్రభుత్వం. ఏయే ప్రాంతాల్లో ఎక్కడెక్కడ క్యాంటీన్ లను ఏర్పాటు చేయాలన్న విషయంపై మంత్రి నారాయణ అధికారులతో చర్చించి తుది జాబితాను విడుదల చేశారు.
పేదల కడుపు నింపాలనే సదుద్దేశంతో కేవలం ఐదు రూపాయలకే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి పూట భోజనాన్ని ఈ అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు అందించనుంది ప్రభుత్వం. 2014లో టీడీపీ ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్ లను తీసుకొచ్చినా.. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ వీటిని రద్దు చేసింది.
ఈ నేపథ్యంలోనే మళ్లీ అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు..అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకం చేశారు. స్వాతంత్ర్యం దినోత్సవం రోజునే పునఃప్రారంభిస్తున్నారు.