జైలుకెళ్తే పెద్ద లీడరవుతాడని అనుకున్నారే కానీ జోగి రమేష్ తన కొడుకుని మొదటగా జైలుకు పంపారు. అమెరికా నుంచి వచ్చాడని పెద్ద ర్యాలీలు తీసి వీడియోలు హైలెట్ చేసుకుని చోటా లీడర్ గా ప్రోజెక్ట్ చేసుకునే ప్రయత్నంలో మంచి ఊపు మీద ఉన్న జోగి రాజీవ్ కు తన తండ్రి స్కెచ్ పూర్తిగా అర్థమయ్యే సరికి జైలులో తేలారు. రాజకీయాలంటే ఇంకా పూర్తిగా ఏమీ తెలియని అమాయకత్వం రాజీవ్ లో కనిపిస్తోంది. అందరూ కొన్నట్లే తాము భూములు కొన్నామని అందులో తప్పేముందని ఆయన అమాయకంగా చెబుతున్నారు. కానీ అందరూ అగ్రిగోల్డ్ భూములు కొనలేదని.. అది తన తండ్రి వేసిన స్కెచ్ అని రాజీవ్‌కు ఇప్పుడు అర్థమై ఉంటుంది.
Read Also : చంద్రబాబు వింటేజ్ పాలిటిక్స్ !
అసలు ఈ వ్యవహారం మొత్తం నడిపింది జోగి రమేష్.. ఆయన సోదరుడే. ఇద్దరూ కలిసి అత్యంత విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను సర్వేనెంబర్ మార్చి కొట్టేయాలని ప్లాన్ చేసుకున్నారు. తమ పార్టీ ఎల్లకాలం అధికారంలో ఉంటుందన్న నమ్మకమో.. మరో కారణమో కానీ.. కళ్ల ఎదురుగా సాక్ష్యాలు ఉండేలా.. సులువుగా దొరికిపోయేలా ఉన్నా సరే స్కాముకు పాల్పడ్డారు. అది తన పేరుపై కాకుండా.. తన కుమారుడి పేరుపై చేశారు. బయటపడితే ముందుగా తన కుమారుడ్ని జైలుకు పంపుతారని తెలిసి కూడా ఆయన తెగించారంటే అనుకోవచ్చు.
జైలుకు వెళ్లిన వాళ్లందరూ లీడర్లు కారు. కానీ జోగి రమేష్ మాత్రం తన కొడుకును ముందే జైలుకు పంపేశారు. ఇప్పటి వరకూ జోగి రమేష్ జైలు మొహం చూడకుండానే ఎదిగారు. ఇక ముందు ఆయన కూడా జైలు జీవితం అనుభవించాల్సి రావొచ్చు. ఇక్కడ కొసమెరుపేమిటంటే.. తనకు అధికారం కోసం జగన్ ను మెప్పించేందుకు చేసిన అడ్డగోలు పనులే.. ఆయనను ఇరికిస్తున్నాయి. ఇప్పుడు జగన్ హాయిగానే ఉన్నారు. కానీ జోగి మాత్రం.. ఆయన కొడుకుతో పాటు జైలు జీవితం గడపాల్సిందే.