నిన్నా మొన్నటి వరకూ అల్లు అర్జున్, సుకుమార్‌లకు పడడం లేదని, ఇద్దరి మధ్యా గ్యాప్ వచ్చిందని టాలీవుడ్ అంతా గుసగుసలాడేసింది. దానికి తగ్గట్టే ‘పుష్ష 2’ సినిమాకు బ్రేక్ రావడం, బన్నీ గెడ్డం తీసేసి, ఆ లుక్ లోంచి బయటకు రావడం జరిగిపోయాయి. కొద్దిరోజుల తరవాత వాతావరణం చల్లబడింది. ‘పుష్ష 2’ షూటింగ్ మొదలైపోయింది.
ఇప్పుడు బన్నీకీ బన్నీ వాస్కీ మధ్య గ్యాప్ వచ్చిందన్న వార్తలు బయట షికారు చేస్తున్నాయి. దానికీ కారణం ఉంది. బన్నీ వాస్ గీతా ఆర్ట్స్ కాంపౌండ్ మనిషి. బన్నీకి ప్రాణ స్నేహితుడు. అయితే ‘జనసేన’ కోసం బన్నీ వాస్ కష్టపడ్డాడు. ‘జనసేన’ టీమ్‌లో తాను ఒకడు. బన్నీ ఏమో… వైకాపాకు సపోర్ట్ చేశాడు. నంధ్యాల వెళ్లి ప్రచారం కూడా చేసొచ్చాడు. స్నేహితుడే అయినా, పార్టీలు వేరు. ఈ విషయంలోనే ఇద్దరికీ గ్యాప్ వచ్చి ఉంటుంది. దాంతో ఈ వార్తలు బయటకు వచ్చేశాయి. బన్నీ వాస్ ఓ సినిమా తీస్తున్నాడంటే బన్నీ ప్రోత్సాహం తప్పకుండా ఉంటుంది. కానీ ‘ఆయ్’ విషయానికి అది లేదు. ఇది గీతా ఆర్ట్స్ 2 సినిమా. అల్లు అరవింద్ నిర్మాత. అయినా సరే… ప్రీ రిలీజ్ వేడుకలోనూ బన్నీ కనిపించలేదు. ఒక ట్వీట్ చేసి చేతులు దులుపుకొన్నాడంతే. దాంతో బన్నీకీ, బన్నీ వాస్కీ మధ్య గ్యాప్ వచ్చిందన్నమాట నిజమే అనే ప్రచారం మరింత ఎక్కువైంది.
దీనిపై బన్నీ వాస్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. బన్నీ తన ప్రాణ స్నేహితుడని, తనకు అవసరం అనుకొన్నప్పుడు బన్నీ సపోర్ట్ తనకు కచ్చితంగా ఉంటుందని, తాను పిలవాల్సిన అవసరం కూడా లేదని, ఇరవై ఏళ్ల క్రితం తన కోసం అల్లు అరవింద్ తో గొడవ పడ్డాడని, అడ్డుగోడలా నిలిచాడని, తన స్నేహితుల్ని కాపాడుకోవడం బన్నీకి బాగా తెలుసని స్పీచ్ దంచి కొట్టారు. ఇప్పుడు ఈ కామెంట్లే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.