2024 అసెంబ్లీ ఎన్నికలు మెగా ఫ్యాన్స్ మధ్య చీలిక తీసుకొచ్చాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ని మెగా ఫ్యాన్స్ దూరం పెట్టారు. నంధ్యాల వరకూ వెళ్లి, వైకాపా నేత కోసం ప్రచారం చేసిన బన్నీ – మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమయ్యాడు. జనసేనకు సపోర్ట్ చేయడం, చేయకపోవడం అల్లు అర్జున్ వ్యక్తిగత వ్యవహారం. అయితే పొలిటికల్ గా తటస్థంగా ఉండాల్సిన తరుణంలో అల్లు అర్జున్ కాస్త పెంకితనం చూపించి మెగా ఫ్యాన్స్ కు దొరికిపోయాడు.
ఇదంతా అయిపోయిన విషయం. మెగా ఫ్యాన్స్ కూడా దీన్ని మర్చిపోతున్నారు. అయితే ఈ మానిన గాయాన్ని వైకాపా నేతలే మళ్లీ మళ్లీ రేపుతున్నారు. బన్నీకీ మిగిలిన మెగా హీరోలకూ ఈ సందర్భంగా వచ్చిన గ్యాప్‌ని ఆసరాగా తీసుకొని, ఫ్యాన్స్ మధ్య వైరాన్ని పెంచాలన్నది వైకాపా టార్గెట్. అందుకే బన్నీ ఫ్యాన్స్ పేరుతో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాలో కొన్ని పేజీలు పుట్టుకొచ్చాయి. అవన్నీ మెగా హీరోల్ని టార్గెట్ చేస్తున్నాయి. బన్నీ Vs మెగా హీరోలు అన్న రీతిలో కొన్ని మీమ్స్ రూపొందించి సోషల్ మీడియాలో వదులుతున్నారు. అసలు అల్లు రామలింగయ్య లేకపోతే, మెగా ఫ్యామిలీనే లేదన్నట్టు, పవన్ కల్యాణ్ సినిమా హీరో అవ్వడానికి కారణం ఆ కుటుంబమే అన్నట్టు మీమ్స్ సాగుతున్నాయి. చరణ్ కంటే బన్నీనే టాప్ అని, యాక్టింగ్ లో బన్నీ తరవాతే మిగిలిన మెగా హీరోలని, అందుకే బన్నీకి నేషనల్ అవార్డు వచ్చిందని మిగిలిన వాళ్లు నందులకే పరిమితం అయిపోయారని మీమ్స్ సాగుతున్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్ ‘స్మగ్లర్లే మన హీరోలు అవుతున్నారు’ అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దాన్ని కూడా వదలడం లేదు. పవన్ చేసిన పాత సినిమాల్ని గుర్తు చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
దానికి మెగా ఫ్యాన్స్ కూడా ధీటుగానే స్పందిస్తున్నారు. ‘పుష్ష 2 రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు చూసుకొందాం లే’ అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఇదంతా బన్నీ కోసం చేస్తున్నామన్నది వైకాపా వాళ్ల అభిప్రాయం కావొచ్చు. కానీ ఈ ముసుగులో బన్నీకి ఎంత అపకారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ‘పుష్ష 2’ విడుదల రోజున ఈ ఎఫెక్ట్ తప్పకుండా పడుతుంది. రేపు.. ఆ సినిమా ఏమాత్రం తేడా కొట్టినా, ట్రోలింగ్ మామూలుగా ఉండదు. ఈ విషయం వైకాపాకి, ఈ మీమ్స్ పేజీలను క్రియేట్ చేసినవాళ్లకు కూడా తెలుసు. కానీ వాళ్ల లక్ష్యం.. ప్రస్తుతానికి మెగా హీరోల ఫ్యాన్స్ కూ, బన్నీ అభిమానులకూ మధ్య చిచ్చు పెట్టడమే. ఈ విషయాన్ని అభిమానులంతా గుర్తు పెట్టుకోవడం మంచిది.