జగన్ ఇండియా వైపు చూస్తున్నారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోన్న వేళ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ సారధ్యంలోని వైసీపీ ఓ పిల్ల కాలువ అని, అది ఎప్పటికైనా మహాసముద్రమైన కాంగ్రెస్ లో కలవాల్సిందేనన్నారు.
ఇండియా కూటమిలో వైసీపీ చేరుతుందన్న ప్రచారాన్ని ఖండించిన షర్మిల..వైసీపీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని పరోక్షంగా వ్యాఖ్యానించడం పలు సందేహాలకు కారణం అవుతోంది. గతంలోనే షర్మిల ఈ కామెంట్స్ చేసినా తాజాగా మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించడం వెనక ఏమైనా మతలబు ఉందా? అని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
ఇండియా కూటమిలో వైసీపీ చేరేందుకు సంసిద్దత వ్యక్తం చేస్తే కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందా? కూటమిలో అవసరం లేదు.. నేరుగా పార్టీనే విలీనం చేయాలని షరతులు విధిస్తుందా..? ఢిల్లీ పర్యటనలో కీలమైన సమావేశం ముగిసిన తర్వాత షర్మిల చేసిన కామెంట్స్ ఈ ప్రశ్నలను తెరమీదకు తీసుకొస్తున్నాయి.
ఇండియా కూటమిలో వైసీపీ చేరుతుందని ప్రచారాన్ని మాత్రమే ఖండించకుండా..విలీనం అవుతుందనే తరహాలో షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో బిగ్ డిబేట్ గా మారాయి. ఇప్పటికే ఏపీలోనూ బలపడాలని, ,అందుకోసం ఏమేం చేయాలన్న దానిపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోన్న వేళ షర్మిల వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.