తెలంగాణలో ఉపఎన్నిక జరగాల్సిన ఒకే ఒక్క రాజ్యసభ స్థానానికి అభిషేక్ మను సింఘ్విని అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ స్థానం నుంచి కే.కేశవరావు ప్రాతినిధ్యం వహించేవారు. ఆయన బీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ లో చేరి పార్టీకి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఉపఎన్నిక వస్తే తనకే పదవి ఇవ్వాలని ఆయన పట్టుబట్టలేదు. ఈ కారణంగా ఆయనకు సలహాదారు పదవి ఇచ్చారు.
కేకేకు సలహాదారు పదవి ఇచ్చినప్పటి నుంచి చాలా మంది కాంగ్రెస్ సీనియర్లు రాజ్యసభ సభ్యత్వం కోసం పోటీ పడ్డారు. ముఖ్యంగా వీహెచ్.. గాంధీభవన్లోనే ప్రెస్ మీట్ పెట్టి డి్మాండ్ చేసినంత పని చేశారు. ఇతర సీనియర్లు లాబీయింగ్ చేశారు. అయితే హైకమాండ్ ఎవర్నీ ప్రోత్సహించలేదు. కనీసం రాష్ట్ర పార్టీ నుంచి ప్రాబబుల్స్ పేర్లను కూడా అడగలేదు. రేవంత్ రెడ్డి కూడా ఎవర్నీ సిఫారసు చేయలేదు.
హైకమాండ్ కోటాలో ఆ రాజ్యసభ సీటును భర్తీ చేయబోతున్నట్లుగా స్పష్టత రావడంతో రేవంత్ రెడ్డి కూడా పెద్దగా ఎవరి కోసం ప్రయత్నించలేదు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన నుంచి రాగానే.. పేరును ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ సీనియర్లంతా హతాశులయ్యారు. కానీ వ్యతిరేకించే పరిస్థితి లేదు. కానీ తెలంగాణ సెంటిమెంట్ తో విమర్శలు చేయడానికి బీఆర్ఎస్కు అవకాశం ఉంది.