మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన సమయంలో డ్రోన్ వినియోగంతో నమోదైన కేసులో అరెస్ట్ చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు భయం పట్టుకుందా? ఈ కారణంగా ఆయన తనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారా? అని రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
మేడిగడ్డ బ్యారేజ్ పై అధికార కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆరోపిస్తూ , అసలు వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని కేటీఆర్ ఆధ్వర్యంలో గత నెలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు బ్యారేజ్ ను సందర్శించారు. ఈ సమయంలోనే మేడిగడ్డ బ్యారేజ్ పై అనుమతి లేకుండా డ్రోన్ వినియోంచడంతో దీనిపై ఇంజినీరింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు కేటీఆర్ తోపాటు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు అయింది.
గతంలో జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌజ్ పై డ్రోన్ ఎగరేసిన కేసులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లుగానే , ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ పై డ్రోన్ ఎగరవేత కేసులో తనను అరెస్ట్ చేస్తారనే భయమో ఏమో కానీ, కేటీఆర్ తనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.
మేడిగడ్డ బ్యారేజ్ డ్రోన్ వినియోగం కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ .. వచ్చే నెల 5వ తేదీ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో కేటీఆర్ తోపాటు బీఆర్ఎస్ నేతలకు హైకోర్టులో స్వల్ప ఊరట దక్కినా, కేసు తీవ్రత దృష్ట్యా కేటీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయమని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.