మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమాస్తుల కేసుకు సంబందించి దాఖలైన పిటిషన్ పై విచారిస్తున్న సుప్రీం ధర్మాసనంలోని జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్నారు.
జగన్ అక్రమాస్తుల కేసులో మొదట సీబీఐ విచారిస్తున్న కేసుల్లో తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పులు ఇవ్వాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినా ఆ పద్థతినే అనుసరించాలని అప్పట్లో స్పష్టం చేసింది. కానీ దీని వల్ల విచారణ ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో హైకోర్టు తీర్పును గతేడాది మే నెలలో ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టులోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం… మొదట్లోనే కీలక ప్రకటన చేసింది. వాదనలు వినిపించేందుకు ఇరు వర్గాల న్యాయవాదులు సిద్ధం కాగానే… తాను ఈ కేసు విచారణ నుండి తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు. నాట్ బి ఫోర్ మీ అని చెప్పటంతో… జస్టిస్ సంజయ్ కుమార్ లేని ధర్మాసనం ముందు కేసును లిస్ట్ చేయాలని మరో న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఆదేశించారు. సెప్టెంబరు 2 నుంచి మొదలయ్యే వారంలో సీజేఐ ఆదేశాల మేరకు మరో ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని ఆయన ఆదేశించారు. దీంతో కేసు విచారణ వాయిదా పడింది.
జగన్ అక్రమాస్తుల కేసు ఆలస్యంపై ఇప్పటికే సుప్రీంలో ఎమ్మెల్యే రఘురామరాజు వేసిన పిటిషన్ విచారణ దశలో ఉంది.