సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన మొదలు తిరిగి వచ్చే వరకు కాంగ్రెస్ పై, సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై బీఆర్ఎస్ గట్టిగానే విమర్శలు చేసింది. ఫేక్ కంపెనీలు అంటూ రోజుకో ప్రెస్ మీట్, సోషల్ మీడియాలో నిత్యం పోస్టింగులు చేసింది. కాంగ్రెస్ నుండి పెద్దగా కౌంటర్ లు ఏమీ కనపడలేదు.
కానీ, కేటీఆర్-హరీష్ రావులకు గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోయామన్న కాంగ్రెస్ శ్రేణుల బాధ… రేవంత్ రెడ్డి ఖమ్మం టూర్ లో తీరనుంది. ఖమ్మంలో సీఎం రేవంత్ మూడో విడత రుణమాఫీ చేయబోతున్నారు. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేసి తీరుతానంటూ దేవుడిపై ఒట్టుపెట్టి మరీ ఎంపీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓట్లు అడిగారు. చెప్పిన మాట ప్రకారమే చేసి చూపిస్తున్నారు.
ఇక, సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ పంచాయితీ కూడా మూడు రోజులుగా నడుస్తోంది. సీనియర్ మంత్రిగా ఉన్న తుమ్మల కంటతడి పెట్టారంటే ఏ స్థాయి పంచాయితీతో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు వీటన్నింటికీ సీఎం రేవంత్ కౌంటర్ ఇవ్వబోతున్నారు. ఫేక్ కంపెనీలు, సీతారామ ప్రాజెక్టు, కేటీఆర్ గతంలో చేసుకున్న ఒప్పందాలపై మాట్లాడే అవకాశం ఉన్నట్లు సీఎంవో వర్గాల ద్వారా తెలుస్తోంది. సీఎం పంద్రాగస్టు వేడుకల తర్వాత నేరుగా ఖమ్మం వెళ్లనున్నారు. అక్కడ సీతారామ ప్రాజెక్టు మోటార్లు స్వీచ్ ఆన్ చేయటం, ఫైలాన్ ఆవిష్కరించటంతో పాటు వైరాలో రుణమాఫీ చేసి అక్కడే బహిరంగ సభలో మాట్లాడనున్నారు.