కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై గట్టిగా తిట్టలేరు… అలాగని కామ్ గా ఉండలేరు… ఇది కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ పరిస్థితి. మామాలుగా తెలంగాణ వాదాన్ని, సెంటిమెంట్ ను రగిల్చే ఏ అవకాశాన్ని బీఆర్ఎస్ వదులుకోదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నిక అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సీనియర్ నేత, ప్రముఖ లాయర్ అభిషేక్ మను సింఘ్వీకి అవకాశం ఇచ్చింది. జాతీయ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ ఎంపిక జరిగింది అనేది కాంగ్రెస్ వాదన. రాష్ట్ర కాంగ్రెస్ నుండి చాలా మంది అవకాశం వస్తుందని భావించినా, సింఘ్వీ వైపు పార్టీ మొగ్గు చూపింది. రాష్ట్ర నాయకత్వం కూడా కాదనలేకపోయింది.
కానీ, దీనిపై కేటీఆర్ ఓ ట్వీట్ వేసి వదిలేశారు. కేసీఆర్ స్పందనే లేదు. తెలంగాణ రాజకీయ అస్తిత్వం ఢిల్లీకి తాకట్టు పెట్టారనే పెద్ద పెద్ద డైలాగ్స్ ఎక్కడా కనపడలేదు. మాములుగా ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ దూకుడుగా పదునైన విమర్శలు చేస్తుంది.
అభిషేక్ మను సింఘ్వీ కాంగ్రెస్ నేత మాత్రమే కాదు ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ కూడా. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత తరఫున, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరఫున కేసులు కొట్లాడుతున్న లాయర్లలో ఈయన కూడా ఒకరు. రాజకీయం వేరు… వృతి వేరు అయినా, బీఆర్ఎస్ వాయిస్ పెంచకుండా ఉండటం వెనుక ఇదే ప్రధాన అంశమా అని బీజేపీ సహా రాజకీయ పక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కానీ బీజేపీ కూడా ఈ విషయంలో కామెంట్ చేయలేదు. ఎందుకంటే బీజేపీ నేత లక్ష్మణ్ కు యూపీ నుండి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు బీజేపీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా… మీరు చేయలేదా అనే మాట పడాల్సి వస్తుంది కాబట్టి ఆ పార్టీ కూడా సైలెంట్ అయిపోయింది.
మొత్తంగా… అభిషేక్ మను సింఘ్వీ అభ్యర్థిత్వంలో బీఆర్ఎస్ ఓ అడుగు వెనక్కి వేయటం చర్చనీయాంశంగా మారింది.