చంద్రబాబుపై జగన్ పెట్టిన దొంగ కేసుల వ్యవహారంలో తొందరపడి ఓ కోయిల ముందే కూసిందన్నట్లుగా వైసీపీ వ్యూహకర్తలు.. ఓ సోకాల్ జర్నలిస్టుతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. చంద్రబాబుపై కేసులు ఉన్నాయి కాబట్టి.. ఆ కేసుల్ని రాష్ట్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయకూడదని.. సీబీఐ, ఈడీ వంటి వాటికి బదిలీ చేయాలని ఆ పిటిషన్ సారాంశం. ఈ పిటిషన్ పై హైకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కేసుల్ని సమీక్షించవద్దని ప్రభుత్వానికి ఎలా చెబుతామని ప్రశ్నించింది.
నిజానికి జగన్ ప్రభుత్వం తనకు ఉన్న అధికారాలతోనే కేసులు పెట్టింది. ఆధారాలు ఉన్నాయా లేవా అని చూడలేదు. అందు కోసం ఐపీఎస్‌లను అడ్డగోలుగా ఉపయోగించుకుంది. అవి తప్పుడు కేసులనడానికి ప్రజల ముందటే అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అవినీతి అనడానికి ఒక్క రూపాయిని కూడా చూపించలేకపోయారు. వారి వాదనలన్నీ తేలిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం మారింది.. జగన్ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉన్నాయో. ఇప్పుడు అలాంటి అధికారాలతోనే.. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది. వారు పెట్టిన కేసుల లోగుట్టు బయటకు తీసుకు రావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది.
ఇది కనిపెట్టే.. కేసుల్ని సీబీఐ.. ఈడీ కి ఇవ్వాలంటూ నాటకాలు ప్రారంభించారు. జగన్ ప్రభుత్వానికి కేసులు పెట్టడానికి ఎన్ని అధికారాలు ఉన్నాయో.. వాటిని సమీక్షించడానికి ప్రస్తుత ప్రభుత్వానికీ అన్నే అధికారాలు ఉంటాయి. వారి హయాంలో సీఐడీ ఎంత బాగా పని చేసిందో.. ఇప్పుడు కూడా అంత కంటే బాగా పని చేస్తుంది. అందులో సందేహమే ఉండదు. మరి ఎందుకు జగన్ అండ్ కో కంగారు పడుతున్నారు.
తప్పుడు కేసుల లోగుట్టు బయటపడితే… అందు కోసం వారు చేసిన ఘోరాలను వెలుగులోకి తెస్తే.. అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో చేశారో ప్రజలకు ఓ క్లారిటీ వస్తుంది. అదే జగన్ అండ్ కో కు అసలు భయం.