రైతు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో సవాల్, ప్రతి సవాల్ తో వేడెక్కిన ఈ రాజకీయాలు మధ్యలో కాస్త చల్లబడి మళ్లీ భగ్గుమంటున్నాయి. హామీ మేరకు రేవంత్ ఆగస్ట్ పదిహేనులోపు రైతు రుణమాఫీని పూర్తి చేయడంతో హరీష్ రావు సవాల్ కు కట్టుబడి రాజీనామా చేయాలనే డిమాండ్ తాజాగా తెరమీదకు రావడంతో బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది.
మూడో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల సమయంలో మరోసారి రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పందించడం.. హరీష్ రావును టార్గెట్ చేయడంతో మళ్లీ రచ్చ మొదలైంది. సవాల్ కు కట్టుబడకపోతే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి, క్షమాపణలు చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత రోజే హరీష్ మీడియా ముంగిటకు వచ్చి స్పందిస్తారని అనుకున్నా.. ఆయన సైలెంట్ గానే ఉండిపోయారు.
కానీ, ఆలస్యంగా హరీష్ రావు మీడియా ముందు ప్రత్యక్షమై రేవంత్ రెడ్డిపై ఎదురుదాడికి దిగడానికి కారణం ఏంటి? ఎందుకింత ఆగ్రహంగా హరీష్ స్పందించారు..? అనే చర్చ జరుగుతోంది. అయితే, గురువారం వైరా సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలతో హరీష్ రావు ఇమేజ్ డ్యామేజ్ అయిందని, సవాల్ విసిరి ఆయన తోక ముడిచారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. గతంలో ఇలాగే సవాల్ విసిరి వెనక్కి తగ్గారని.. ఇప్పుడూ అదే పంథాను అనుసరిస్తున్నారని హరీష్ పై విమర్శలు వచ్చాయి.
దీంతో రేవంత్ వ్యాఖ్యలపై స్పందించకుంటే తన ప్రతిష్ట మరింత దెబ్బతింటుంది అనే ఉద్దేశ్యంతోనే ఆలస్యంగా రేవంత్ రెడ్డిపై హరీష్ ఎదురుదాడికి దిగారనే వాదనలు వినిపిస్తున్నాయి.