ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లా క్రికెట్ సంఘానికి శివనాథ్ అధ్యక్షుడిగా ఉన్నారు. పాత కార్యవర్గం రాజీనామా చేయడంతో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఏసీపీలోని అన్ని పదవులకు ఒక్కొక్కరే నామినేషన్లు వేయడంతో పోటీ జరగలేదు. ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్ , కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా ఎమ్మెల్యే విష్ణు కుమార్రాజు ఎన్నికయ్యారు. అధికారిక ప్రకటన మాత్రం.. వచ్చే నెల ఎనిమిదో తేదీన చేస్తారు.
2019లో వైసీపీ అధికారంలోకి రాగానే అప్పటి వరకూ గోకరాజు గంగరాజు చీఫ్ గా ఉన్న ఏసీఏను విజయసాయిరెడ్డి చెందిన బృందం కబ్జా చేసింది. ఆయన అల్లుడు, అల్లుడి సోదరుడ్ని అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా పెట్టి.. తన బినామీని కోశాధికారిగా పెట్టి క్రికెట్ తో రాజకీయాలు చేసారు. అనేక అవకతవకలకు పాల్పడ్డారు. చివరికి ఆటగాళ్ల ఎంపికకూ డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. హనుమ విహారి వంటి అంతర్జాతీయ క్రికెట్లను కూడా వేధించారు.
చివరికి ప్రభుత్వం మారిపోవడంతో.. ఏసీఏ నుంచి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయేందుకు విజయసాయిరెడ్డి బృందం ప్రయత్నించింది. అయితే.. పాత లెక్కలన్నీ తేల్చేందుకు కొత్త అధ్యక్షుడు శివనాథ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో క్రికెట్ పాలనను మళ్లీ గాడిలో పెట్టాలని అమరావతిలో స్టేడియాన్ని పూర్తి చేయాలని శివనాథ్ లక్ష్యంగా పెట్టుకున్నారు.