రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. సంపూర్ణ రైతు రుణమాఫీ జరగకుండానే.. రుణమాఫీ పూర్తి అయినట్లు ప్రచారం చేసుకుంటున్నారని చేస్తోన్న విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రమంతా అర్హులందరికీ రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే రాజీనామాలకు సిద్దమని అటు కేటీఆర్ , హరీష్ మరోసారి సవాల్ చేశారు.
రుణమాఫీ విషయంలో రేవంత్ టార్గెట్ గా బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నా.. బీజేపీ మాత్రం పెద్దగా స్పందించడం లేదు. రాజకీయం అంతా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా సాగిపోతోంది. ఈ రేసులో తాము వెనకబడిపోతున్నామని అనుకున్నారో ఏమో కానీ , బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం ఎంటర్ అయ్యారు.
కేటీఆర్ ,హరీష్ రావు తరహాలోనే మహేశ్వర్ రెడ్డి సవాల్ విసరకుండా.. ఓ అడుగు ముందుకు వేశారు. రాష్రంలో సంపూర్ణంగా రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. 17వేల కోట్లతో రుణమాఫీ చేసిన ఫార్ములా ఏంటో చెప్పాలని అన్నారు.
గత కొద్ది రోజులుగా రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ వినిపిస్తోన్న వాదనకు ఇప్పుడు బీజేపీ కూడా జత అయిందని, దీంతో కాంగ్రెస్ రెండు పార్టీలను ఎలా ఎదుర్కొంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.