కేసీఆర్ కుటుంబం రాజకీయాల నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకులో తేల్చేశారు. బీజేపీ బారిన పడి నలిగిపోవడం కంటే .. పార్టీని విలీనం చేయడమో.. పొత్తులు పెట్టుకోవడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నారు… కానీ ఆయన నిస్సహాయతను అర్థం చేసుకున్న బీజేపీ పెద్దలు కేసీఆర్, కేటీఆర్ రాజకీయాలకు దూరం అయిపోవాలని.. హరీష్ రావుకు మాత్రం ప్రాధాన్య పదవి ఇస్తామని చెబుతున్నట్లుగా ఆర్కే అంతర్గతగంగా జరుగుతున్న బేరాల గురించి వివరించారు. ఢిల్లీలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న చర్చల రాజకీయాలపై ఆర్కే ఇన్ సైడ్ విషయాలను ఈ సారి వివరించారు.
తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలెవరికీ ఆవగింజ అంత పలుకుబడి కూడా ఢిల్లీలో హైకమాండ్ వద్ద లేదని సర్టిఫికెట్ జారీ చేశారు. ఆయన అసహనానికి కారణం ఏమిటంటే.. బీఆర్ఎస్ విలీనం లేదా పొత్తులు వద్దే వద్దని వీరు చెప్పే మాటల్ని హైకమాండ్ కనీసం పట్టించుకోవడం లేదట. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ , బండి సంజయ్ మాటలకు.. అభిప్రాయాలకు కనీస విలువ ఇవ్వడం లేదని అంటున్నారు. బీజేపీతో బీఆర్ఎస్ చర్చలపై తెర వెనుక ఏం జరుగుతుందో ఆర్కే చెప్పుకొచ్చారు.
ఓ గవర్నర్ రెండు పార్టీల మధ్య చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయనే విలీనం లేదా పొత్తుల ఫార్ములాను ఖరారు చేసి అందర్నీ ఒప్పిస్తున్నారని అంటున్నారు. ఈ గవర్నర్ చెప్పే మాటలకు హైకమాండ్ వద్ద మంచి గురి ఉందని ఆర్కే చెబుతున్నారు. ఆ గవర్నర్ ఎవరో చిన్నహింట్ ఇవ్వలేదు. కానీ నిన్నామొన్నటి వరకూ తెలంగాణ ఇంచార్జ్ గవర్నర్ గా వ్యవహరించిన కేఎం రాధాకృష్ణన్ చంద్రబాబుతో తరచూ చర్చలు జరిపారు. ఓ సారి విజయవాడకూ వచ్చి సమావేశమయ్యారు. అంతకు ముందు సమావేశం అయినట్లుగా స్పష్టత లేదు కానీ ఏపీలో బీజేపీ, టీడీపీ పొత్తు కుదరడంలోనూ ఓ గవర్నరే కీలక పాత్ర పోషించారని.. ఆయనే ఇప్పుడు తెలంగాణలో విలీన రాజకీయాలు నడుపుతున్నారని అంటున్నారు. ఆయన రాధాకృష్ణనో .. మరో గవర్నరో కానీ… ఆర్కే చెప్పిన దాని ప్రకారం… తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు జీరోలు కాబట్టి… గవర్నర్లుగా ఉన్న కంభం పాటి హరిబాబు, దత్తాత్రేయలు ఈ రాజకీయ పొత్తులు, విలీన చర్చలు జరిపే అవకాశాలు తక్కువే అనుకోవచ్చు.
మొత్తంగా కేసీఆర్ విలీన చక్రవ్యూహంలో చిక్కుకున్నారని సులువుగానే అర్థమవుతోంది. బీజేపీ నోట చిక్కితే ఆయనకు.. ఆయన కుమారుడికి రాజకీయ భవిష్యత్ దాదాపు అంతమైనట్లేనని.. ఆర్కే తన విశ్లేషణ ద్వారా సంకేతాలు పంపారు. బీజేపీతో రాజీ పడకపోయినా కవితకో ఇవాళో.. రేపో బెయిల్ వస్తుందని.. దాని కోసం లొంగిపోవాల్సిన అవసరం లేదని కూడా ఆర్కే పరోక్ష సలహా ఇచ్చారు. మొత్తంగా కేసీఆర్ , కేటీఆర్ ఇప్పుడు రాజకీయాలకు దూరం కావాలా… ఎన్నో కష్టాలు పడేందుకు సిద్ధం కావాలా అన్నది వారే నిర్ణయించుకోవాల్సి ఉందన్నది అంతిమంగా కొత్త పలుకు సారాంశం.