స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనే వారికి ముగ్గురు పిల్లలు ఉంటే అనర్హత అనే నిబంధన ఉండేది. దాన్ని తాజాగా చంద్రబాబు తొలగించారు. మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు కొంత కాలంగా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరు పిల్లలతో సరి పెట్టుకోవద్దని ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఆయన ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ పిలుపుపై చాలా మంది ట్రోల్ చేస్తూ వచ్చారు. ఇప్పటికీ చేస్తూనే ఉంటారు.
జననాలు ఇలాగే తగ్గిపోతే దేశానికి గడ్డుకాలం
దేశంలో పెరిగిపోతున్న జననమరణాల మధ్య నిష్పత్తి మధ్య తేడా, వర్కింగ్ ఏజ్ తగ్గిపోతూండటం వంటి కీలకమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. చంద్రబాబు భవిష్యత్ లో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడటానికి ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నట్లే. ఎగతాళి చేస్తే భవిష్యత్ తరం పడే బాధల్ని అంచనా వేయడం కష్టం. కానీ ఇప్పుడు పిల్లల్ని కనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.. ఒకరితోనే సరి పెట్టుకుంటున్నారు. చంద్రబాబు వంటి వారి విజ్ఞప్తులు పని చేయడం కష్టమే.
ఉనికి సమస్యల్లో జపాన్
ఇప్పుడు చైనా , జపాన్ తోపాటు అనేక దేశాల జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. జపాన్ అయితే.. కొన్నాళ్ల తర్వాత అదృశ్యమయిపోతుందేమో అన్నంతగా భయపడుతోంది. అక్కడ అంతా వృద్ధ జనాభానే. కొత్తగా పిల్లల్ని కనేందుకు అక్కడి జంటలు ఆసక్తి చూపించడం లేదు. అక్కడ అతి పెద్ద పట్టణాల్లో కూడా ఇళ్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. అంతే జపాన్ టైం దగ్గర పడిందని అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. అక్కడి పాలకులు భయపడుతున్నారు. ఇక చైనా ఈతి బాధల గురించి చెప్పాల్సిన పని లేదు. వన్ చైల్డ్ పాలసీని రద్దు చేసి ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కంటే.. మొత్తం తామే భరిస్తామన్న ఆఫర్లు చేసేవరకూ వచ్చారు. కానీ అక్కడి ప్రజలు ఎవరూ ఆసక్తి చూపించడంలేదు.
చంద్రబాబు చెబుతోంది అదే !
ప్రస్తుతం దేశానికి వర్కింగ్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు. ఇది మన దేశానికి ఎంతో మేలు . కానీ తర్వాత పరిస్థితి ఏమిటి ?. తగ్గిపోతున్న జననాల రేటు.. ఒకరిద్దరితోనే సరిపెట్టుకుంటున్న కుటుంబాల కారణంగా .. బ్యాలెన్స్ తప్పుతోంది. రానున్న రోజుల్లో వర్కింగ్ ఏజ్ పీపుల్ అంటే 15 నుంచి 59 ఏళ్లలోపు వారు తగ్గిపోనున్నారు. ఇలాంటి ప్రమాదం ఏపీకి ముంచుకు రావడం ఖాయమనే చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలకు రాబోయే ప్రమాదాన్ని గురించి హెచ్చరిస్తున్నారు. కానీ ప్రజలు ఆయన మాటల్ని సీరియస్ గా తీసుకుని పిల్లల్ని కనడం కష్టమే. ఎందుకంటే… ఆ పిల్లల బాధ్యతల్ని ప్రభుత్వాలు ఇసుమంత కూడా మోయవు మరి !