ప్రభుత్వం మారి రెండు నెలలు దాటిపోయింది. ఇప్పటికీ కొన్ని చోట్ల ఫైల్స్ తగలబడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. శనివారం ఒక్క రోజే.. రాజమండ్రిలో పోలవరం పరిహారానికి సంబంధించిన ఫైల్స్ ను తగులబెట్టారు. టీటీడీ పరిపాలనా భవనంలో ఇంజినీరింగ్ విభాగంలో కీలక ఫైళ్లు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. ఇప్పటికే ఇలాంటివి ఎన్ని జరిగాయో లెక్క లేదు, ఏకంగా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో భూ ఫైళ్లకే నిప్పు పెట్టారు.
కొన్ని చోట్ల ప్రమాదాలు.. మరికొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్లి నిప్పు పెట్టడం చేస్తున్నారు. అక్రమాలు బయట పడకుండా చేయడానికే ఇలా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అదే నిజమైతే ఖచ్చితంగా ప్రభుత్వానిదే చేతకానితనం అవుతుంది. ఫైల్స్ కాల్చేసినా ఏమీ కాదని ఓ భావన వారిలో పెరిగిపోవడం వల్లనే ఇలా విచ్చలవిడిగా కాల్చేస్తున్నారు. ప్రభుత్వం మారిన వెంటనే.. సిట్ ఆఫీసులో పత్రాలను తగులబెట్టిన వారిని… ఆ ఆదేశాలిచ్చిన కొల్లి రఘురామిరెడ్డి అనే అధికారిని జైల్లో వేసి ఉంటే… తర్వాత ప్రతి ఒక్కరూ భయంతో ఉండేవారు. ఐపీఎస్ ఆఫీసర్నే వదిలి పెట్టలేదు…. అని భయపడేవారు. టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో జరిగిన అవకతవకలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు అవే ఫైళ్లు ఎలా తగలబడతాయి ?.
కానీ ఎన్ని ఫైళ్లు ప్రమాదాలు జరిగినా.. ఎన్నింటికి నిప్పు పెట్టినా… ఎంత వారున్నా ఊరుకోబోమని భారీ స్టేట్ మెంట్లు తప్ప చర్యలు లేకపోవడంతో బరి తెగిస్తున్నారు. అసలు అక్రమాలు చేసిన వ్యవహారాలు బయట పడటం కన్నా… ఫైళ్లు తగలబెట్టిన నేరం కింద నిందలు ఎదుర్కోవడం మంచిదని ఫీలవుతున్నారు.
అందుకే ఫైళ్లు తగలబడిపోతున్నాయి.